ఆత్మకు సద్గతి - దుర్గతి ఉంటుందా?

శ్రీ గణేశాయ నమః - శ్రీ మాత్రే నమః - శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

 

ఆత్మకు ‘సద్గతి – దుర్గతి’ అనే స్థితులు ఉంటాయా?

 

భగవద్గీత సమూహంలో ఒక జ్ఞాన సాధకురాలి ప్రశ్న ఇది. ఎవరైనా మరణిస్తే సంతాప సూచకంగా ఈ పదాలను వాడుతూ ఉంటారు. ‘వారి ఆత్మకు సద్గతి లభించాలి, వారి ఆత్మ శాంతించాలి, శాంతి, వారికి విష్ణు సాయుజ్యం లభించాలి, వారు శివైక్యం చెందారు’ ఇత్యాది పదాలతో సంతాపాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ‘ఆత్మకు సద్గతి – దుర్గతి అనేవి అసలు ఉంటాయా?’ అన్నది ప్రధానమైన విషయం ఇప్పుడు.

 

‘ఆత్మ’ నిర్గుణ మరియు శుద్ధ తత్త్వాన్ని కలిగి ఉంటుంది. అది తామరాకు పై నీటి బిందువు వలే ఉంటుంది. నిజానికి ఆత్మలో ఏవిధమైన వాసనలూ ఉండవు. అందుకే స్వచ్చమైన ఆత్మ సదా ఆనందమయ స్థితిలో ఉంటుంది. అంతేకాదు, దేహం నశించినంత మాత్రాన అది నశించదు:

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। భగీ ౨.౨౭ ।।

ఆత్మకు జనన మరణాలు లేవు.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ।। 2.23 ।।

ఆత్మను ఆయుధాలు ఛేదించ లేవు, అగ్ని కాల్చనూ లేదు, నీరు తడుపనూ జాలదు, గాలి వలన ఎండిపోదు. ఎందుకంటే దానికి జననం గాని మరణం కాని లేదు.

ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే.

 

ఆత్మకు దేహం అవసరమా?

 

ఆత్మ దేహాన్ని ఆవహించి ఉంటుంది. శరీర రాహిత్యాన్ని పొందిన ఆత్మకు పరమాత్మకు మధ్య భేదం లేదు. అదే మోక్షం. ఆత్మ శరీర ధారణ ఎందుకు చేయాలి? శరీరాన్ని ధరించకుండా ఉంటే అది తన స్వచ్చమైన ఆనందమయ స్థితిని యథాతధంగా కలిగి ఉండి పరమాత్మ తో సమానమై ఉంటుంది కదా! మరి ఆత్మలు శరీర ధారణ ఎందుకు చేస్తాయి? భగవంతుడు తన కర్మాచరణలో భాగంగా సృష్టిని నిర్మించాడు. ప్రకృతిని మరియు సమస్త జీవరాశిని సృష్టించాడు. అందులో అత్యంత ప్రధానమైన వాడు ‘మనిషి’. మనిషికి మాత్రమే బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇతర జీవులకు ఇవ్వలేదు. అట్టి బుద్ధి మరియు జ్ఞానం సహాయంతో ప్రకృతి అంతర్గతమైన సమస్త జీవరాశిని, మరియు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతను మనిషికి అప్పగించాడు. అందుకే వాడు కర్మలను ఆచరించాలని చెప్పాడు. సృష్టి ఒక క్రమబద్ధంగా నడవాలంటే మనిషి విధిగా కర్మలను ఆచరించాలి. కర్మను ఆచరించని మనిషికి మరియు ఇతర జంతువులకు మధ్య భేదం ఉండదు. అంతేకాదు వాడు జీవించి ఉన్నా కూడా నిష్ప్రయోజనం. భగవద్గీతలో మనం చదువుకున్నాము – మనిషి తపో దీక్షలో ఉన్న, ధ్యాన ముద్రలో ఉన్నా, యోగ ముద్రలో ఉన్నా, సమాధి స్థితిలో ఉన్నా, లేదా ఇతర ఏ అవస్థలో ఉన్నా కర్మను ఆచరిస్తున్న వాడిగానే పరిగణింప బడతాడు. కర్మలు రెండు రకాలు. ఒకటి - శాస్త్ర విహితమైన కర్మలు, రెండు – శాస్త్రం సూచించని కర్మలు లేదా శాస్త్ర విరుద్ధమైన నిషిద్ధ కర్మలు. శాస్త్ర విహితమైన కర్మలు లోక కళ్యాణానికి పనికొస్తే, శాస్త విరుద్ధమైన నిషిద్ధ కర్మల ద్వారా నాశనం జరుగుతుంది. ఇవన్నీ నిర్గుణ తత్త్వాన్ని కలిగి యున్న ఆత్మ తాను ధారణ చేసిన శరీరం ద్వారా మాత్రమే సంభవమౌతుంది. ఇంతటి గొప్ప తత్త్వాన్ని కలిగి ఉన్న మనిషి ప్రకృతి సిద్ధమైన వస్తు మరియు విషయముల వైపు ఆకర్షితుడై, వాటిని పొందాలనే తపనతో కర్మలను ఆచరించడం వలన నిషిద్ధ కర్మలను ఆచరించిన వాడౌతున్నాడు. 

 

మనిషి నిర్మాణంలో బుద్ధిని మరియు మనస్సును కూడా భగవంతుడు ప్రసాదించాడు. ఇట్టి మనస్సే కర్మలకు మూలం. బాహ్య వస్తు మరియు విషయ మోహంలో ఉన్న మనస్సు కర్మాచరణను ప్రోత్సహిస్తుంది. తద్వారా పొందే ఫలాన్ని వాడు అనుభవిస్తూ కూడా కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. వస్తు మరియు విషయ వ్యామోహంలో గల మనస్సు సమస్త ఇన్ద్రియాలను నియంత్రిస్తూ ఉంటుంది. జన్మాంతరకృత వాసనల ద్వారా పొందిన ప్రవృత్తికి అనుగుణంగా అది వస్తు మరియు విషయముల వైపు ఆకర్షితురాలౌతూ ఉంటుంది. తదనుగుణంగా ఇన్ద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో ఇన్ద్రియాలు నిమిత్తం అంతవరకూ మాత్రమే ఉంటుంది. కోరికలు లేని మనస్సు, వస్తు మరియు విషయ వాసనలు లేని మనస్సు వస్తు మరియు విషయాలను ఆకర్షించమని ఇన్ద్రియాలను ఆదేశించదు. అప్పుడే నిర్గుణ స్థితిలో గల ఆత్మ ప్రకాశిస్తుంది. అంతవరకూ అది:

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। భగీ 3.38 ।।

పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమున్ను, మావిచేత గర్భ మందలి శిశువున్ను ఏవిధంగా కప్పబడి యుండునో, అదే విధంగా కామము చేత ఆత్మజ్ఞానము కూడా కప్పబడి యుండును.

ఇట్టి స్థితిలో గల ఆత్మ ప్రకాశించదు. వంద మంది దుర్మార్గుల మధ్య ఒక ఉత్తముడు జ్ఞాని ఉన్నా ప్రయోజనమేమీ ఉండదు. అంతమంది దుర్మార్గుల మధ్య ఆయన కనుమరుగౌతాడు.

 

విషయ వాంఛలను త్యజించిన ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ ధారణ చేసిన దేహం మరణించిన పిమ్మట అది తన వాసనలు మోసుకొని మరొక దేహానికి చేరకూడదని అనుకుంటే మనిషి క్రమంగా వాసనలను త్యజిస్తూ పోవాలి. ఫలాపేక్ష రహితమైన లోక సంగ్రహార్థం కర్మలను ఆచరించడం వలన ఆత్మను ఆవహించి ఉన్న వాసనల పొర తొలగిపోయి ఆత్మ ప్రకాశిస్తుంది. అదే ఆత్మ యొక్క ‘సద్గతి’. స్వీయ ప్రయోజనార్థం లేదా ఫలాపేక్షతో ఆచరించే ప్రతి కర్మా ఆత్మను కప్పి పెట్టి ఉంచుతుంది. వాసనలతో కప్పబడి ఉన్న ఆత్మ ‘దుర్గతి’ స్థితిలో ఉంటుంది. అందుకే ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ సద్గతిని పొందాలని కోరుకుంటారు. అనగా వారి ఆత్మను కప్పి ఉన్న వాసనలను తొలగించుకుంటూ క్రమక్రమంగా వాసనా రహితమై అది ప్రకాశించాలని కోరుకోవడమే దీని అర్థం. అప్పుడే మోక్షం సుగమం అవుతుంది. అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది మరియు విష్ణు సాయుజ్యాన్ని పొందుతుంది, శివైక్యం చెందుతుంది. అంతేగాని ఈ జన్మలో పొందని లేదా లభించని వస్తు విషయాలను వచ్చే జన్మలో తప్పక పొందాలని, సాధించాలని ఆశించడమే ఆత్మ యొక్క ‘దుర్గతి’. స్వస్తి.

 

నమిలికొండ విశ్వేశ్వర శర్మ

శ్రీ విశ్వావసు నామ సం ఉగాది

30.03.2025