Retrograde Jupiter - Results

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శుభ గ్రహా

 

గ్రహల వక్రగతి – గురు వక్రీ ఫలితాలు

 

‘గ్రహ వక్రీ’ అనే పదం తరచూ జ్యోతిషంలో వినబడుతూ ఉంటుంది. ‘వక్రీ’ అనగా వక్రించుట. ముందుకు కదులుతున్న గ్రహ కాస్త వెనుకకు కదులుట. గ్రహాలు నిజంగా ముందుకు వెళ్ళే బదులు వెనుకకు వెళ్తాయా? అనే సందేహం అందరి మనస్సులో మెదులుతూ ఉంటుంది. కాని నిజానికి అవి వెనుకకు వెళ్ళవు. భూమి పై నుండి చూస్తున్న మనకు అవి వెనుకకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు. రెండు రైళ్లు పక్కపక్కన ముందుకు వెళ్తూ ఉంటే అందులో ఒక దాని వేగం మరొక దాని కంటే తక్కువ ఉన్న ఎడల అది వెనుకకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అది కదలకుండా ఒకే చోట ఉండి మనం ప్రయాణిస్తున్న రైలు ముందుకు కదిలినా కూడా నిలబడి ఉన్న రైలు వెనుకకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక రకమైన ఆప్టికల్ ఇల్ల్యూజన్ (నేత్ర భ్రమ). ఖగోళంలో కూడా అంతే. గ్రహాల మధ్య ఏర్పడిన వేగాల తేడా వలన ఈవిధమైన భ్రమ కలుగుతూ ఉంటుంది. అవి నిర్దిష్టమైన వేగంతో కదులుతూ ఉంటే ఇట్టి భ్రమ కలుగదు. కాని వాటి వేగంలో తేడా వస్తే మాత్రం ఇట్టి భ్రమ కలుగుతుంది. ఇట్టి వక్రగతికి జ్యోతిష్యంలో చాలా ప్రాధాన్యత కలదు.

 

రవి చన్ద్రుడు మినహా మిగిలిన గ్రహాలన్నీ కూడా వక్రిస్తాయి. వాటికి మూడు రకాలైన వేగాలు ఉంటాయి:

కుటిల – నిశ్చల

అను వక్రీ – తక్కువ వేగం

వక్రీ – అతి వేగం లేదా ‘త్వరణం’

రెండు రైళ్లు సమానమైన వేగంతో పక్కపక్కన ప్రయాణిస్తుంటే రెండూ కూడా కదిలినట్లు అనిపించదు. ఇదే ‘కుటిల’ లేదా నిశ్చల. అందులో ఒకరైలు కాస్త వేగాన్ని పుంజుకుంటే తక్కువ వేగంతో వెళ్తున్న రైలు కొంత వెనుకకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అదే ‘అనువక్రీ’. ఒక రైలు మరొక రైలును అతి వేగంగా దాటుతూ ముందుకు వెళ్తే వేగంగా వెనుకకు వెళ్తున్నట్లు అనిపించే రెండవ రైలు ‘వక్రీ’. రవి మరియు చంద్రుల మినహా మిగిలిన గ్రహాలన్నీ వక్రిస్తాయి. ‘వక్రీ’ ని సూర్య గ్రహ ఆధారంగా చేసుకొని నిర్ణయిస్తారు. కుజ గురు మరియు శని భ వక్రగతికి జ్యోతిషంలో అధిక ప్రాధాన్యత కలదు.

 

రాబోయే సంవత్సర కాలంలో:

కుజుడు:
07.12.2024 నుండి 24.02.2025 వరకు

గురు:

09.10.2024 నుండి 04.02.2025 వరకు

శని:

30.06.2024 నుండి 15.11.2024 వరకు

 

‘గురు వక్రీ’

ఈ శీర్షికలో గురు గ్రహ వక్రీ ఫలం గూర్చి తెలుసుకుందాము. వక్రించిన గ్రహాలు జాతకుని జన్మకుండలి ప్రకారం ఫలితాన్ని ఇస్తాయి. ఒకవేళ అది శుభ లేదా యోగించే గ్రహ అయిన ఎడల అది రెట్టింపు వేగంతో శుభ ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ ప్రతికూల గ్రహ లేదా మారక గ్రహ అయిన ఎడల దాని ప్రతికూల ఫలాలు రెట్టింపు వేగాన్ని పుంజుకుంటాయి. ఇది ప్రధానంగా జాతకుని జన్మ లగ్నం ఆధారంగా నిర్ణయించ బడుతుంది. జన్మ రాశి వశాత్ ఇట్టి వక్రగతి ఫలితాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అనగా గురు భ జాతక రీత్యా యోగ కారకుడైన ఎడల ఆయన ఇచ్చే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఒకవేళ ప్రతికూల లేదా మారక గ్రహ అయిన ఎడల ఆయన ఇచ్చే ప్రతికూల ఫలాలు కూడా రెట్టింపు అవుతాయి. కాని, అది అశుభ స్థానంలో గాని, నీచ క్షేత్రంలో గాని మరియు శత్రు క్షేత్రంలో గాని ఉన్న ఎడల సంపూర్ణ శుభ ఫలితాలను ఇవ్వలేదు. కాని అశుభ ఫలితాలను మాత్రం రెట్టింపు వేగంతో ఇస్తుంది. అది శుభ స్థానాలలో, స్వక్షేత్ర, మూల త్రికోణ మరియు ఉచ్ఛ రాశిలో సంచరిస్తున్న ఎడల శుభ ఫలితాలు రెట్టింపు వేగంతో అందుతాయి. అశుభ ఫలితాల తీవ్రత తగ్గుతుంది. గురు భ ప్రస్తుతం వృషభ రాశి – శత్రు క్షేత్రంలో పయనించు చున్నాడు. గురు భగవానుడు:

వృశ్చిక, ధనుస్సు మరియు మీన లగ్నాలలో జన్మించిన వారికి సంపూర్ణ యోగ కారకుడు.

మేష, కర్కాటక, సింహ, కుంభ లగ్నాలలో జన్మించిన వారికి యోగ కారకుడు, మిశ్రమ ఫలాన్ని కూడా ఇస్తాడు

వృషభ, మిథున, కన్య, మకర మరియు తులా లగ్నాలలో జన్మించిన వారికి అశుభుడు మరియు మారకుడు.

 

మేషాది ద్వాదశ లగ్నాల వారికి గురు గ్రహ వక్ర గతి ఫలం:

‘మేష’ లగ్నంలో జన్మించిన వారికి – శుభ ఫలాలు అధికంగా లభిస్తాయి. ధన మరియు రాజ్య లాభాలు.

‘వృషభ’ లగ్నంలో జన్మించిన వారికి – ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఉద్యోగ భంగ యోగాలు.

‘మిథున’ లగ్నంలో జన్మించిన వారికి కూడా ప్రతికూల ఫలాలు. ఉద్యోగ పరమైన సమస్యలు, భాగస్వాములతో విభేదాలు.

‘కర్కాటక’ లగ్నంలో జన్మించిన వారికి అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి. రాజ్యలాభం. పదోన్నతులు, చక్కని కార్యసిద్ధి.

సింహ లగ్నంలో జన్మించిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. పదోన్నతులు, కార్యసిద్ధి. స్వల్ప అనారోగ్యం

కన్యా లగ్నంలో జన్మించిన వారికి మిశ్రమ ఫలాలు లభిస్తాయి.

తులా లగ్నంలో జన్మించిన వారికి అత్యంత ప్రతికూల ఫలాలు లభిస్తాయి. ఉద్యోగ భంగ యోగాలు, అధిక ధన వ్యయం, రాబడి తగ్గుట, అనారోగ్యం.

వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి. రాజ్య లాభం, భాగస్వాముల ద్వారా లాభం, ఉద్యోగ లాభం, చక్కని కార్యసిద్ధి

ధనుర్లగ్నంలో జన్మించిన వారికి స్వల్ప శుభ మరియు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు మరియు శత్రుభీతి. మాతృ విభేదం, ఆస్తుల లావాదేవీలందు సమస్యలు.

మకర లగ్నంలో జన్మించిన వారికి ప్రతికూల ఫలాలు మరియు సందర్భము లందు మిశ్రమ ఫలాలు లభిస్తాయి. ప్రయోజనకారి మాత్రం కాదు.

కుంభ లగ్నంలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా లభిస్తాయి. అప్పుడప్పుడు కొంత ప్రయోజనం కూడా చేకూరుతుంది.

మీన లగ్నంలో జన్మించిన వారికి శుభ మరియు మిశ్రమ ఫలితాలు సమానంగా లభిస్తాయి. చెప్పుకోదగిన ప్రయోజనం ఏమీ ఉండదు.

 

ఎవరూ కూడా భయపడాల్సింది ఏమీ లేదు. యూ ట్యూబ్ ఇత్యాది సామాజిక మాధ్యమాలలో భయపడే విధంగా చెబుతూ ఉంటారు. జాతకులు జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో కష్టసుఖాలు సహజంగా అందరికీ వస్తూనే ఉంటాయి. జ్యోతిష్యం అంటేనే జ్యోతిని వెలిగించునది. రాబోవు కాలంలో ప్రతికూల సమయం అధికంగా ఉందని తెలిస్తే జాగ్రత్తగా ఉండాలి. అనుకూలంగా ఉందని ఉప్పొంగి పోరాదు. ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే ముందు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ధార్మిక మరియు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉండాలి. ‘పఞ్చ మహా యజ్ఞాలు’ చేస్తూనే ఉండాలి. అప్పుడే గ్రహ చర ప్రభావాన్ని ఎదుర్కునే శక్తి మానవుడికి వస్తుంది. మీరు ఏ లగ్నంలో జన్మించారో చూసుకొని జాగ్రత్త పడితే సరిపోతుంది.

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।

 

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి