SanAtana Dharma

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

 

సనాతన ధర్మానికి భంగం ఎందుకు వాటిల్లుతుంది?

 

నేడు సనాతన ధర్మం గూర్చి మాట్లాడే వారి సంఖ్యా విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి ఇదొక మంచి పరిణామం. కాని సనాతన ధర్మం అంటే ఏమిటో, అది ఏమి చెబుతుందో తెలియనివాళ్ళే అధికంగా ఉంటారు. క్రితం ఒక ప్రముఖ తమిళ సినిమా హీరో సనాతన ధర్మం నశించాలని రాజకీయ ప్రకటన చేసాడు. ఆ ప్రకటనకు చాలా వ్యతిరేకత వచ్చింది. నేడు మరొక సినిమా హీరో సనాతన ధర్మం నశిస్తే లేదా దానికి భంగం వాటిల్లితే తాను ఊరుకోనని ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. అసలు సనాతన ధర్మం ఏమిటి? అది ఏమి చెబుతుంది? సనాతన ధర్మం ఏమిటని ఎవరిని అడిగినా పూజలు పునస్కారాలు చేయడం, దైవ భక్తి కలిగి ఉండడం, దేవాలయాలకు వెళ్ళడం, మత మరియు కులాచారాలను పాటించడం ఇత్యాదివని చెబుతారు. సింహభాగం జనాలకు ఇంతే తెలుసు. ఇంతకూ మించి సనాతన ధర్మం గూర్చి ఎవరికీ తెలియదు.

 

మానవుడి జీవనం విధానం ‘సనాతన ధర్మ’ పరిమితుల్లో మాత్రమే ఉండాలి. ఇట్టి సనాతన ధర్మ నియమాలు ఒక్క భారతీయులకు లేదా హిందువులకు మాత్రమే కాదు, సమస్త మానవాళికి కూడా వర్తిస్తాయి. ఇవి ఏ ఒక్క కులానికో, వర్ణానికో, మతానికో మరియు జాతికో చెందినవి కావు. మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ ఇట్టి సనాతన ధర్మ నియమాలు వర్తిస్తాయి. అట్టి సనాతన ధర్మాలను అనుసరించు వాడే మనిషిగా గుర్తింప బడతాడు. మనిషి ధర్మ మార్గంలో నడవడానికి కావలసిన నియమాలే ‘సనాతన ధర్మ నియమాలు’. ధర్మం మరియు ధర్మానికి చెందిన నియమాలు భూమిపై పుట్టిన ప్రతి మానవుడికి వర్తిస్తాయి. ధర్మాన్ని ‘మతం’ గా భావిస్తారు. కాని అది తప్పు. ధర్మం అనగా ‘నియమం’. ఉదాహరణకు: నేరం చేయడం అధర్మం. నేరం చేయకపోవడమే ధర్మం. చేసినవాడు శిక్షించ బడాలి. అదే ‘న్యాయం’. అనగా ధర్మ సూత్రాలను అతిక్రమిస్తే తప్పు. వాడు శిక్షించబడాలి. అదే సృష్టి యొక్క నియమం. ధర్మం మనిషై జన్మించిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. మనిషిగా జన్మించిన మరుక్షణం ఇట్టి కట్టుబాట్లు వర్తిస్తాయి. ధర్మ సూత్రాలు అనువర్తించ బడతాయి. ధర్మానికి మతం రంగు పూయరాదు. ‘సనాతన ధర్మం’ అనగానే హిందువులకు చెందినదనే వాదన కలదు. అలా ఎందుకు? దానికి గల ప్రధాన కారణం అత్యంత ప్రాచీనమైన హిందూ ధర్మాలు. ‘హిందూ ధర్మం’ ఒక మతం కాదు. హిందూ ధర్మం వేరు మరియు హిందూ మతం వేరు. హిందూ ధర్మాన్ని ఆచరించేవాడే హిందువు. వీరందరి నమ్మకమే ‘సనాతన ధర్మం’. వారందరూ కలిస్తే హిందూమతం. ఈ ధర్మం మానవుడి జీవన విధానాన్ని నిర్దేశించు ప్రముఖ మార్గం. హిందూ ధర్మం మానవుడి జీవన విధానంగా ఎందుకు గుర్తించబడింది? ఇతర మతాలకు ఈ గుర్తింపు ఎందుకు లేదు?

 

శ్రీ మహావిష్ణువు సృష్టి ఉత్పత్తికి ప్రధాన సూత్రధారి. జీవరాశి ఉత్పత్తి జరగని రోజుల్లో అనగా జీవరాశి అన్నదే లేని రోజుల్లో శ్రీ మహావిష్ణువు ‘సోఽకామయత’ ఈవిధంగా కోరుకున్నాడు - ‘బహుస్యాం ప్రజాయేయేతి’ తాను అధిక సంఖ్యగా మారిపోవాలి అనగా చాలామంది ప్రజల ఉత్పత్తి జరగాలి అని కోరుకుని ‘స తపోఽతప్యత’ ఆయన తపస్సు చేశాడు. ‘స తపస్తప్త్వా ఇదగ్౦ సర్వమసృజత యదిదం కించ’ ఆవిధంగా తపస్సు చేసి సృష్టిని జీవరాశిని అంతటినీ సృష్టించాడు. ‘తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్’ ఆవిధంగా సృష్టిని రచించి అందరిలో ప్రవేశించాడు. ‘తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్’ ఆ విధంగా ప్రవేశించి సత్య స్వరూప పరమాత్మగా మారిపోయాడు (తైత్తిరీయ ఉపనిషత్ – ద్వితీయ వల్లీ – షష్ఠ అనువాకః). అనగా సత్యమే పరమాత్మ స్వరూపం. అందుకే ‘సత్యం వద – ధర్మం చర’ అని అన్నారు. సత్యం వృద్ధి చెందాలి, అప్పుడే ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది. ‘ప్రజాయే’ అనగా మనుషులు మాత్రమే కాదు. సమస్త జీవరాశిగా పరిగణించాలి. సనాతన ధర్మం గూర్చి చెప్పమంటే ఈ సోదంతా ఎందుకు చెబుతున్నాననే సందేహం అందరికీ వస్తుంది. అది సహజం కూడా. సనాతన ధర్మ యొక్క నిజ స్వరూపం తెలియాలంటే ముందు ఇది తెలియాలి.

 

సమస్త జీవరాశి ఉత్పత్తి జరిగిన పిమ్మట సృష్టిని ఒక్క పధ్ధతి ప్రకారం నడిపే బాధ్యతను బ్రహ్మకు అప్పగించాడు. అప్పుడు సృష్టి చక్రం ఒక క్రమ పద్ధతిలో నడవడానికి గాను చతుర్ముఖ బ్రహ్మ ‘యజ్ఞాన్ని’ సృష్టించాడు. యజ్ఞాన్ని ఎందుకు సృష్టించాడు? అనగా జీవికి దేహంలో ప్రాణం నిలబడి ఉండుటకు, శరీర యాత్ర సాగుటకు గాను అన్నం కావాలి. అందుకే:

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యా దన్నసంభవః ।

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। భగీ 3-14 ।।

ప్రాణులు అన్నము వలన కలుగు చున్నవి. అన్నము మేఘము (వర్షము) వలన కలుగు చున్నది. మేఘము (వర్షము) యజ్ఞము వలన కలుగు చున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగు చున్నది.

ఇది యజ్ఞం చక్రం. అనగా మనిషై జన్మించిన ప్రతి ఒక్కడూ యజ్ఞాన్ని ఆచరించాలి. దాని ద్వారా మాత్రమే వర్షాలు కురుస్తాయి, తద్వారా అన్నం లభిస్తుంది. యజ్ఞాన్ని ఆచరించాలంటే కర్మను ఆచరించాలి. అట్టి కర్మలు శాస్త్ర విహితమై ఉండాలి. శాస్త్ర విహితమైన కర్మలు సదా ధర్మ బద్ధమై ఉంటాయి. అప్పుడే యజ్ఞం సక్రమంగా నిర్వహించిన వారమౌతాము. వర్షాలు చక్కగా కురుస్తాయి. యజ్ఞం అనగానే అగ్ని ప్రతిష్ఠ చేసిన యజ్ఞాలనే భావన ఉంటుంది. కాని అది కల్పానికి చెందిన ఒక అర్థం.

 

వేదాంత సంబంధంగా ఆలోచిస్తే యజ్ఞాలు 5 రకాలుగా ఉంటాయి:

పితృ యజ్ఞము, నృ యజ్ఞము, భూత యజ్ఞము, దేవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము

పితృ యజ్ఞము: పితృ దేవతల ప్రీతికరం ఆచరించు పితృ కర్మ. ఇది యజ్ఞ సమానమైనది. ఇది ఎందుకు చేయాలి? మన పూర్వీకుల జ్ఞాన సంపదనే నేడు మనను ప్రకాశింపజేయు చున్నది. మన జ్ఞాన సంపదకు మూలం వారే. వారి జన్యు ప్రభావం వలన మాత్రమే మనం ఈరోజు ప్రకాశించగలుగు చున్నాము. అందుకే వారి ప్రీత్యర్థం పితృ కర్మను విధిగా ఆచరించాలి.

నృయజ్ఞము: ఇదే మానవసేవ. భగవంతుడు మనకు అద్భుతమైన మానవ జన్మను ప్రసాదించాడు. ప్రతి జీవిలో గల ఆత్మ స్వరూపమే పరమాత్మ. కర్మ లోపం వలననో, ఇతర ఏ కారణాల వలననో శారీరికంగా, ఆర్థికంగా, మానసికంగా పలు రకాలుగా కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. అట్టి వారికి చేసే సేవనే ‘మాధవసేవ’. వారికి తగిన విధంగా చేయూతను అందించడం, పేదవారి ఆకలి తీర్చడం, వారికి అన్న వస్త్రాదులను అందించడం, వారి కష్టంలో తగిన విధంగా పాలు పంచుకోవడం, వారికి తగిన విధంగా వైద్య సేవలను అందించడం ఇత్యాదివన్నీ కూడా నృయజ్ఞాలే. ఇవి మాధవ సేవతో సమానమైనవి.

భూత యజ్ఞం: సృష్టిలో సమస్త జీవరాశిని సృష్టించిన వాడు ఈశ్వరుడే. పశు పక్షదులన్నీ ఈశ్వరుని సృష్టి మాత్రమే. ఈశ్వర నిర్మితమైన ప్రకృతిలో అవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇట్టి జీవరాశి మాత్రమే కాదు, ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతలో ప్రధాన పాత్రను పోషించు వృక్ష సంపద ఇత్యాది వన్నీ కూడా ఈశ్వర నిర్మితాలే. వాటిని తగిన విధంగా కాపాడడం మానవ ధర్మ. వాటికీ తగిన విధంగా ఆహారాన్ని అందించడం, వాటిని కాపాడడం ఇవన్నీ కూడా మానవ ధర్మాలే. అప్పుడే ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది. ఇవి కాపాడబడితేనే ప్రకృతి సురక్షితంగా ఉంటుంది. ఇవి సక్రమంగా ఆచరించడమే భూత యజ్ఞం.

దేవ యజ్ఞం: ఇది బ్రహ్మ యజ్ఞం కంటే ముందుగా ఆచరించునది. దేవతలందరూ పరమేశ్వర స్వరూపాలు. వారికి అర్పించిన భక్తి, అర్చన, ధ్యానం, తర్పణలు, హోమాలు, ఆహుతులు తర్పణలు ఇత్యాదివన్నీ కూడా వారి ప్రీతికరం ఆచరించు కర్మలే. వారే సమస్త సృష్టికి రక్షకులు. వారికి మనం సదా రుణపడి ఉంటాము. వారి రక్షణ లేనిదే మనం జీవించి ఉండలేము.

బ్రహ్మ యజ్ఞం: ఇది మహోన్నతమైనది. సర్వం వ్యాపించి యున్న పరమాత్మకు ఆత్మ సమర్పణ గావించుట. ఇది మొదటి నాలుగు విధాలైన యజ్ఞాలను సక్రమంగా ఆచరించిన పిదప మాత్రమే సాధ్యమౌతుంది. సాధారణ యజ్ఞాలలో హోమ ద్రవ్యం ఉంటుంది. కాని దీనిలో అదేమీ ఉండదు. ఇది జ్ఞాన సంబంధమైనది. అందుకే ‘బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత’ ను ‘ప్రస్థాన త్రయం’ అంటారు. అవి చెప్పిన సూత్రాలను సాధన చేయడమే జ్ఞాన సాధన. ఇది మోక్ష కారకము. పితృ రుణాన్ని, నృ ధర్మాన్ని, సమస్త భూత రుణాన్ని మరియు దేవతా రుణాన్ని తీర్చుకున్న పిదప మాత్రమే మనిషి ఋణ విముక్తుడై జ్ఞానాన్ని తద్వారా బ్రహ్మత్వాన్ని, ఆ తరువాత పరమాత్మ యందు విలీనం కాగలడు. దాన్నే మనం మోక్షం అంటాము. పైన చెప్పబడిన రుణాలను మనిషి విధిగా తీర్చుకోవాలి. అప్పుడే ఋణ విముక్తుడయ్యే అవకాశం కలదు. ఇవి ఆచరించడం వలన సమస్త సృష్టి పట్ల తన విశ్వసనీయతను చాటుకున్న వాడౌతాడు.


ఈ యజ్ఞాలను ప్రతి ఒక్కడూ విధిగా ఆచరించాలి. అప్పుడే యజ్ఞ చక్రం సక్రమంగా నడుస్తుంది. సృష్టి కూడా సక్రమంగా నడుస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్ర విహితమైన కర్మలుగా పరిగణించబడతాయి. ఇవి ఏ ఒక్క మతానికో, దేశానికో, జాతికో, కులానికో చెందినవి. ఇవే మానవ ధర్మ నియమాలు. ఇవే సనాతన ధర్మ నియమాలు. మొదటి మూడింటినీ, అనగా పితృ యజ్ఞము, నృ యజ్ఞము, భూత యజ్ఞము ఆచరించకుండా నేరుగా నాలుగవ యజ్ఞం ‘దేవ యజ్ఞం’ ఆచరించడాన్ని శాస్త్రం ఒప్పుకోదు. ‘దేవ యజ్ఞం’ కూడా స్వార్థ ప్రయోజనానికి ఆచరించడం సమ్మతం కాదు. అట్టి కర్మ స్వప్రయోజనానికి జరుపు కర్మగా పరిగణించ బడుతుంది. అట్టి కర్మ యొక్క ఫలాలలో వాడు బంధించబడతాడు. ఈవిధమైన కర్మలను ఆచరించడమే ‘సనాతన ధర్మం’. ఇవన్నీ కూడా స్వీయ ప్రయోజనం లేని కర్మలు. అందుకే ఇవి శాస్త్ర విహిత కర్మలు. అదే మానవ ధర్మం. ‘మనిషి ధర్మబద్ధంగా నడచుకోవాలి’ అదే సనాతన ధర్మం.


‘సనాతన’ అనగా శాశ్వతమైనది. శరీరంలో జీవుడు ఉంటాడు. అట్టి జీవుడు పరమాత్మ సమానమైన వాడు. ‘జీవో దేవా సనాతనః’ అట్టి వాడు శాశ్వతమైన వాడు. వాడికి నాశనం లేదు. నాశనం లేనిది ఏదైనా కూడా అది ‘సనాతనమే’. నశించేది ఏదైనా కూడా ‘సనాతన’ అని అనబడదు. అందరి శరీరాల్లో గల ఆత్మ వాసనా రహితమైన నాడు పరమాత్మ సమానమైనది. ఆత్మను పలు విధాలైన వాసనలు కప్పిపెట్టి ఉంచుతాయి. దాని నిజ స్వరూపాన్ని బయటకు రానివ్వకుండా కప్పిపెట్టి ఉంచుతాయి. ఆత్మ వాసనా రహితమైన నాడు, అది పరమాత్మ సమానమైనది. మనిషి కర్మాచరణలో మనస్సు కంటే ముందు బుద్ధితో విశ్లేషించి కర్మకు పూనుకోవాలి. ఆచారాలు మరియు కట్టుబాట్లు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అందుకే వాటిని ‘సనాతన ఆచారం’ అని అనరాదు. ‘అవశ్యం పితురాచారః’ మన పూర్వీకులు దేన్ని ఆచరిస్తే దాన్నే మనం ఆచరించాలి, అది మన ధర్మం. ఇట్టి ఆచారాలలో కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. మన పూర్వీకులు ఆచరించిన ఎన్నో కర్మలను, వాటి ఆచరణ విధిని మనం కొంతవరకు త్యజించాము. రాబోవు తరాలు ఇంకా కొన్నిటిని వదిలిపెడతారు. అవి కాల మరియు యుగ ధర్మాన్ని అనుసరించి మారుతూనే ఉంటాయి. కాని సనాతనమైన ధర్మం ఏనాడు మారదు. పఞ్చ మహా యజ్ఞాలలో మొదటి మూడింటినీ ఆచరించిన వారిని సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వారిగా పరిగణలోకి తీసుకోవచ్చు.


ఈ మధ్యకాలంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో చేసిన నైవేద్యాన్ని స్వామి వారికి నివేదన చేయడం వలన ‘సనాతన ధర్మానికి భంగం’ కలిగిందని ఆక్షేపిస్తున్నారు. దేవాలయాల్లో స్వామి వారికి గాని లేదా ఇతర దేవతలకు గాని జరిగే పూజలు, కైంకర్యాలు వైఖానస ఆగమ శాస్త్రాలను అనుసరించి చేస్తారు, చేయాలి కూడాను. అట్టి శాస్త్రాల ప్రకారం వారికి అలంకారాలు, వారికి జరిపే పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు ఇత్యాదివన్నీ ఉంటాయి. స్వచ్చమైన నాణ్యమైన వస్తువులను మాత్రమే ఇట్టి పూజలలో, నివేదనలలో వాడాలి. అదే శాస్త్ర సమ్మతం. దాన్ని అతిక్రమించి కల్తీ నెయ్యి వాడడం ఒక మానవ తప్పిదం. ఒకవేళ కల్తీ నెయ్యితో నివేదన చేసి ఉంటే అందుకు బాధ్యులైన వారు శాస్త్రాన్ని అతిక్రమించిన వారౌతారు, అంతేకాదు వారు అధర్మ మార్గంలో పయనించిన వారు కూడా ఔతారు. ఒకవేళ నిజంగా ఆవిధంగా జరిగి ఉంటే వారు శిక్షార్హులు. ఇదొక్కటే కాదు, తిరుమలలో మాత్రమే కాదు. ఇంకా చాలా దేవాలయాల్లో ఇవే జరుగుతూ ఉంటాయి. ఇది కాకపోతే మరొకటి.  పలు విధాలైన అక్రమాలు, దోపిడీలు దేవాలయాల్లో జరుగుతూనే ఉన్నాయి. నేడు చాలా దేవాలయాల్లో దేవతలకు వచ్చిన కైంకర్యాలు, వారి సంపదలు, ఆస్తులు దోచుకునే వారు ఉన్నారు. నేనే చాలా దేవాలయాల్లో చూసాను – ప్రత్యేక దర్శనానికి భక్తులు తీసుకునే టిక్కెట్‌లను తిరిగి కౌంటర్ లందు అమ్ముకునే వారిని. అంతెందుకు, దేవస్థానాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ వద్ద కమిషన్ తీసుకొని వాడికి బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. నాసిరకం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అధర్మాలే. వీటిని కూడా ధర్మం అంగీకరించదు. ‘సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయాత్’ అన్నారు. అనగా సత్యమే పలకాలి. ప్రియమైన వాక్కులే పలకాలి. పఞ్చ మహా యజ్ఞాలను ఆచరించాలి. ఎవరినీ పీడించ రాదు. సమస్త జీవరాశి పట్ల దయను కలిగ ఉండాలి. ‘క్షమా గుణం’ ఉండాలి. ఇవన్నీ ‘సనాతన ధర్మ నియమాలు’. వీటిని యథాతథంగా ఆచరిస్తే సనాతన ధర్మాన్ని రక్షించిన వారమౌతాము. భ్రష్టాచారం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో భగవంతుడిని కూడా వదిలిపెట్టడం లేదు. అట్టి వారు తప్పక ‘దైవ శాపానికి’ గురికాక తప్పదు. ‘భ్రష్టాచారం, ప్రజలను పీడించడం, స్త్రీలను గౌరవించక పోవడం, వర్ణ సంక్రమణం, పలు వివాహాలు చేసుకోవడం, పరాదార ప్రవృత్తి, శాస్త్రాలు సూచించిన విధంగా వస్త్రధారణ చేయక పోవడం, సాత్విక ఆహారాన్ని భుజించక పోవడం అతిథిని అగౌరవ పరచడం, ఆడంబరానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అసత్య జీవనం, కామ, క్రోధాలకు బానిసగా మారడం ఇత్యాదివన్నిటి వలన ‘సనాతన ధర్మానికి’ భంగం వాటిల్లుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే ముందుగా దాన్ని కాపాడడానికి వచ్చిన వాడు ధర్మ బద్ధమైన శాస్త్ర విహితమైన కర్మలను ఆచరించు వాడై ఉండాలి. అప్పుడే అది రక్షించబడుతుంది. ‘సనాతన ధర్మాన్ని’ స్వప్రయోజనానికి వాడుకునే వారి వలన అది రక్షించబడదు సరికదా విలువలు ఇంకా దిగజారిపోతాయి. అట్టి వాడు శ్రేష్టుడిగా గుర్తించబడితే అది ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః ।

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। భగీ 3-21 ।।

గొప్పవాడు మరియు శ్రేష్ఠుడు ఏ కర్మను ఆచరిస్తే తక్కిన వారు కూడా దాన్నే చేస్తారు. అతడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే లోకమంతా దాన్నే అనుసరిస్తారు.

అందుకే ఆవిధంగా గుర్తింపు పొందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రేష్ఠుడు కాని వాడు అట్టి గుర్తింపు పొందడం మరింత ప్రమాదకరం.   

‘ధర్మో రక్షతి రక్షితః’


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి