2025-26 Sri Vishwavasu

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

శుభ గ్రహ

 

శ్రీ విశ్వావసు నామ సంవత్సర పఞ్చాఙ్గ పఠనం

 

పఞ్చాఙ్గ శ్రవణానికి విచ్చేసిన పూజ్యులు, పెద్దలు జ్ఞానులు, మరియు సమస్త సభకు నా నమస్సుమాంజలలు. ఈ పఞ్చాఙ్గ పఠనము లోక కళ్యానార్థము నిర్దేశించ బడినది. అంతే గాని వ్యక్తిగతముగా గాని, ఏదేని ఒక వర్గమును గాని, మతమును గాని, సామాజిక వర్గాన్ని గాని మరియు ఏ ఇతరులను గాని ఉద్దేశించి చేసింది కాదు. శాస్త్రాన్ని నిష్కర్షగా విడమరచి చెప్పుటయే దీని ప్రధాన ఉద్దేశ్యం.

 

చిత్రభాను నామ సం. అనగా 2002 సం మొదలు సహృదయులైన ‘సహృదయ’ వారు నిరంతరం నాకు అందించిన ఆదరణ గౌరవము నేను మరవలేను. నేను వారికీ సదా ఋణ పడి ఉంటాను. ‘సహృదయ’ తో నా సాంగత్యం అప్పుడే రెండు పుష్కరాలు అనగా 24 సం. అయ్యింది.

 

శ్లో:    కళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్న దోషావహం

         గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్ ।।

         ఆయుర్వృద్ధిదమ్ ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం

         నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్ ।।

         శ్రీమత్కామితదాయి కర్మషహరం దుర్దోష శాంతిప్రదం

         నానా యజ్ఞ విశేషమధ్యఫలదం భూదాన తుల్యం నృణామ్ ।।

         ఆరోగ్య ఆయురభీష్టదం శుచికరం సంతాన సౌఖ్యోదయం

         పుణ్యం కర్మ సుసాధనం శృతి హితం పంచాంగ మాకర్ణ్యతాం ।।

 

అనగా శోభాయుక్తమైనది, కోరికలు తీర్చునది, పాపాలను సంహరించునది, దుర్దోషములను పోగొట్టునది, అనేక యజ్ఞముల వలన పొందిన ఫలాలను ప్రసాదించునది. జనులకు భూదానాది సమానమైన ఫలాలను ప్రసాదించు నది. ఆయుష్షు మరియు ఆరోగ్యమును కలుగజేయునది, సంతాన సౌఖ్యమును మరియు పవిత్ర కర్మలకు యోగ్య ప్రదమగు శాస్త్ర సమ్మతమైన పఞ్చాఙ్గ పఠనమును వినవలెను.

 

యుగారంభం చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది పండగ గా మనము జరుపుకుంటాము. ఇట్టి శుభ దినమున బ్రాహ్మి ముహూర్తమున లేచి కాలకృత్యాదులను తీర్చుకొని, మంగళ స్నానాలను ఆచరించి, నూతన లేదా శుభ్రమైన వస్త్రములను ధరించి; శ్రీమన్మహా గణపతిని, శ్రీ సరస్వతి మరియు లక్ష్మీ దేవిని, మన ఇష్ట మరియు కుల దైవమును ఆరాధించి, దైవజ్ఞులు మరియు గృహము నందు గల పెద్దల ఆశిస్సులు పొంది, పఞ్చాఙ్గాన్ని పూజించి నమస్కరించాలి. పిదప వేప పువ్వు, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం మరియు ఆవు నెయ్యితో చేసిన ‘పఞ్చ భద్ర’ అనే ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి, పిదప బంధు మిత్రులతో కలిసి సేవించాలి.

 

కాల ప్రమాణం (సంక్షిప్తంగా)

చతుర్యుగాలు:

సత్య యుగ            17,28,000 సం

త్రేతా యుగ            12,96,000

ద్వాపర యుగం         8,64,000

కలియుగం               4,32,000

మొత్తం                 43,20,000 -    ఒక చతుర్యుగం లేదా కల్పం

ఒక మన్వంతరం  71 చతుర్యుగాలు (30,67,20,000)

ఒక మన్వంతర సంధి  17,28,000 (ఒక సత్యయుగ ప్రమాణం)

బ్రహ్మ ౧ దిన           432,00,00,000 (14 మన్వంతరాలు మరియు 15 మన్వంతర సంధులు)

14 మన్వంతరాలు: 1. స్వాయంభువ, 2. స్వారోచిష, 3. ఉత్తమ, 4. తామస, 5. దైవత, 6. చాక్షుష, 7. వైవస్వత, 8. సూర్య సావర్ణి, 9. దక్ష సావర్ణి, 10. బ్రహ్మ సావర్ణి, 11. ధర్మ సావర్ణి, 12. రుద్ర సావర్ణి, 13. దేవ సావర్ణి మరియు 14. ఇన్ద్ర సావర్ణి. ప్రస్తుతము మనము వైవస్వత మన్వంతరం లోని కలియుగ ప్రథమ పాదంలో గతాబ్దాః 5125 (అనగా గడచిపోయినవి).

 

ప్రభవ నుండి అక్షయ వరకు 60 సం. అందులో ఈ రోజు 39 వ సం అయిన శ్రీ విశ్వావసు నామ సం ప్రారంభం. వచ్చే సంవత్సరం శ్రీ పరాభవ నామ సం.

 

శ్రీ విశ్వావసు నామ సం ఫలం:

శ్లో:    విశ్వావసౌ వివిధ సస్యయుతా ధరిత్రీ నానాకర ప్రచుర తో యుద మేఘ బృందైః

         నానావిధ క్రతు పరేషుచ విప్ర సంఘై ర్భాత్యంగ వంగ మగధ విహితశ్చ చోరైః ।।

భూమి అంతటా సస్యములతో నిండి – సువృష్టి కరంగా ఉండును. యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించబడు చుండును. అంగ-వంగ-మగధ దేశాలకు (తూర్పు భారతదేశం) చోర పీడా ఎక్కువగా ఉండును.

 

 బార్హస్పత్యమానేన శ్రీ సిద్ధార్థ నామ సం. ఫలం:

శ్లో:    సిద్ధార్థ వత్సరే భూపాశ్శాంత వైరా స్తధా ప్రజాః

         సకలా వాసుదా భాతి బహుసస్యార్ఘ వృష్టిభిః ।।

ప్రజలు మరియు రాజులు విరోధము లేకుండా సుఖముగా ఉంటారు. చక్కని ధరలతో, మంచి వర్షాలతో, పంటలతో భూమి నిండి ఉంటుంది.

 

శ్రీ మార్గశిర మాసాబ్ధి ఫలమ్:

శ్లో:    సౌమాఖ్య వర్షే శలభాండ జాఖు మృగ దాభిశ్చాఖిల సస్యహాని

         అత్యల్ప వృష్టి ర్బహురోగ పీడా భవంతి భూపాః కలహాత్యుకాస్స్యుః ।।

పశు పక్షాదులచే పంటలకు అధిక నష్టం వాటిల్లుతుంది. వర్షాలు తక్కువగా ఉంటాయి. రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. రాజుల మధ్య కలహాలు అధికంగా ఉంటాయి.

 

 

అథ రాజాది నవనాయకా ఫలమ్:

రాజ్ఞాః రవిః ఫలమ్:

వర్షారంభము భానువారం అగుట వలన రాజు రవి.

అన్యోన్య వైరం క్షితి పాలకానాం నాత్యంబు ముచంతి బలహాకాశ్చ

భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్ని బాధా బ్దపతౌ పతన్గే ।।

రవి రాజు అగుట వలన రాజులకు అన్యోన్య వైరం, వర్షాలు సమానంగా కురుస్తాయి, ప్రజలకు మరియు రాజులకు శస్త్ర భీతి, చోరభయం మరియు అగ్నిభయం అధికంగా ఉంటాయి.

 

మంత్రిణః చన్ద్రస్య ఫలమ్:                                                                            

మేష సంక్రమణం సోమవారం అగుట వలన మన్త్రి చన్ద్రుడు:

సువృష్టి స్సర్వ సస్యానాం ఫలితా వృక్ష జాతయః

క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి ।।

మంత్రి చన్ద్రుడు అగుట వలన – భూమి అంతయూ సువృష్టి, వర్షాలు చక్కగా కురుస్తాయి, అన్ని రకాలైన పంటలతో నిండి ఉంటుంది. ప్రజలందరూ క్షేమ ఆరోగ్యాలను కలిగి ఉంటారు.

  

సేనాధిపతేః శన్యస్య ఫలమ్:

సింహ సంక్రమణం శనివారం అగుట వలన సేనాధిపతి శని:

సేనాధిపే సూర్యసుతే ధరిత్యాం సేనావిముక్తా స్సతతం నరేన్ద్రాః

అధర్మయుక్తా స్సతతం ప్రజాశ్చ కృష్ణాని ధాన్యాని ఫలంతి భూమౌ ।।

శనికి సేనాధిపత్యం లభించుట వలన పాలకులు సైన్య రహితులౌతారు. ప్రజలు అధర్మ మైన పనులందు ఆసక్తిని కలిగి ఉంటారు. నల్లని ధాన్యాలు చక్కగా ఫలిస్తాయి. నల్లని భూములయందు పంటలు చక్కగా పండుతాయి.

 

సస్స్యాధిపతేః బుధస్య ఫలమ్:

కర్కాటక సంక్రమణం బుధవారం నాడు అగుట వలన సస్స్యాధిపతి బుధుడు.

మధ్య వృష్టిర్మంద సస్స్యం మేఘావాతేన పీడితాః 

త్రసంతి మనుజా నిత్యం బుధే సస్యాధిపే సతి ।।

బుధుడు సస్స్యాధిపతి అగుట వలన వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. పంటలు తక్కువగా పండుతాయి. మేఘాలు గాలి వలన చెదరగొట్ట బడతాయి. ప్రజలు నిత్యం భయపడుతూనే ఉంటారు.

 

ధాన్యాదిపతేః కుజస్య ఫలమ్:

ధనుస్సంక్రమణం భౌమవారం అగుట వలన ధాన్యాధిపతి భౌముడు.

ఫలంతి శూక ధాన్యాని రక్త ధాన్యాని యానిచ

రక్త భూమి సుఫలితౌ భౌమే ధాన్యాదిపే సతి ।।

కుజ భ ధాన్యాధిపతి అగుట వలన పొట్టు గల ధాన్యాలు, ముల్లు గల ధాన్యాలు మరియు ఎర్రని ధాన్యాలు బాగుగా ఫలిస్తాయి. ఎర్రని నేలలు బాగుగా ఫలిస్తాయి.

 

అర్ఘాధిపతేః సూర్యస్య ఫలమ్:

మిథున సంక్రమణం ఆదివారం అగుట వలన అర్ఘాధిపతి సూర్యుడు:

అనర్ఘతాల్ప వృష్టిశ్చ ప్రజానా క్షుద్భయం తథా

రాజ్ఞాం పరస్పర క్రోధ స్సూర్యే అర్ఘాధిపేయది ।।

సూర్యుడు అర్ఘాధిపతి అగుట వలన వర్షాలు తక్కువగా కురుస్తాయి, పంటలకు మరియు వస్తువులకు గిట్టుబాటు ధర లభించదు, ప్రజలు ఆకలి భయం కలిగి ఉంటారు, రాజులు పరస్పర క్రోధంతో ఉండి యుద్ధ వాతావరణం నెలకొంటుంది.

 

మేఘాధిపతేః సూర్యస్య ఫలమ్:

సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము ఆదివారం నాడు అగుట వలన మేఘాధిపతి రవి భ.

మహాద్భయం ఫలం స్వల్పం వర్షం స్యాత్ఖండ మండలే

రక్త సస్స్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి ।।

ప్రజలందు భయం అధికంగా ఉంటుంది, ఖండ వృష్టి వలన పంటలు తక్కువగా పండుతాయి. ఎర్రని సస్స్యాలు చక్కగా ఫలిస్తాయి.

 

రసాధిపతే శుక్రస్య ఫలమ్:

తులా సంక్రమణము శుక్రవారం అగుట వలన రసాధిపతి శుక్రుడు.

తిలతైల గుడాః క్షౌద్రం పయాంశి దధి శర్కరాః

అర్ఘవృద్ధ్యాప్రజాయంతే శుక్రేయది రసాధిపే ।।

శుక్రుడు రసాధిపతి అగుట వలన నువ్వులు, నూనెలు, బెల్లం, ఉప్పు, పెరుగు, పంచదార మున్నగు రస సంబంధమైన వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

 

నీరసాధిపతేః బుధస్య ఫలమ్:

మకర సంక్రమణము బుధవారం అగుట వలన నీరసాధిపతి బుధుడు.

గారుత్మతాది రత్నాని ధాన్యాని వివిధానిచ

సర్వాణి వృద్ధి మాయంతి బుదే నీరస నాయకే ।।

బుధుడు నీరసాధిపతి అగుట వలన మరకతాది లేదా జాతి పచ్చ ఇత్యాది రత్నాలు మణి మాణిక్యాలు సమృద్ధిగా లభిస్తాయి. వివిధ రకాలైన ధాన్యాలు చక్కగా వృద్ధి చెంది సమృద్ధిగా లభిస్తాయి.

 

మేష సంక్రమణ ఫలం:

అస్మిన్ వర్షే చైత్ర బ పాడ్యమి ఆది/సోమ తేది 13/14.04.2025 శు పఞ్చమి, ఉదయాత్పూర్వం గం 05:45 ని స్వాతి నక్షత్ర యుక్త, వజ్ర నామ యోగ. కౌలవ కరణే భానోర్మేశ రాశి ప్రవేశః.

పాడ్యమి – శుభకరం

సోమవారం– సుభిక్షం

స్వాతి– సస్స్యాభివృద్ధి

వజ్ర యోగం – వృష్టికరం

కౌలవ కరణం – వృష్టికరం

కుంభ లగ్నం – స్వల్ప వృష్టి

రాత్రి – సస్స్య వృద్ధి, క్షేమం, ఆరోగ్యం

మఖాది నక్షత్ర మండలం – హాని

పగలు మేష సంక్రాంతి వలన కలహములు అధికం, రాత్రి యందు సస్స్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కల్గును.

ఈ సంవత్సరం రాత్రి పూట మేష సంక్రమణం అగుట వలన – సస్స్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కల్గును.

 

ఆర్ద్ర ప్రవేశ కాల ఫలమ్:

దివార్ద్రా సస్య నాశాయ రాత్రౌ సస్స్యాభివృద్ధయే ।

అస్తమా నేర్థ రాత్రౌ చే న్మహదర్ఘం సువృష్టికృత్ ।।

ఉదయాది ద్వికాలము లందు ఆర్ద్ర కార్తె ప్రవేశించిన ఎడల సస్స్య నాశనము కలుగును, రాత్రి యందు అయిన ఎడల సస్స్యాభివృద్ధి ఉంటుంది. సాయంత్రము మరియు రాత్రి సమయమున ప్రవేశించిన ఎడల సువృష్టి మరియు ధాన్యానికి ధరలు అధికంగా ఉంటాయి.

22.06.2025, జ్యేష్ఠ బ ద్వాదశి, ఆదివారం రాత్రి గం 12:06 ని భానోరార్ద్ర ప్రవేశః

ద్వాదశి – ఉత్తమ ఫలం. ఆదివారం – పశు హాని, సుకర్మన్ యోగం – వృద్ధికరం, కౌలవ కరణం – వృష్టికరము, భరణి – ఆశుభకరము, మీన లగ్నం – సస్స్య వృద్ధి, భరణ్యాది మండలం – సస్స్య వృద్ధి.

 

వాస్తు కర్తరీ నిర్ణయము

05.05.2025 to 12.05.2025 -    డొల్లు కర్తరి   

12.05.2025 to 30.05.2025 -    నిజ కర్తరి (వస్తు కర్తరి)

వాస్తు కర్తరి యందు మట్టి, శిల, కర్ర పనులు నిషేధము. నూతన గృహ నిర్మాణము చేపట్ట రాదు. వృక్షములు నరుకుట, బండలు కొట్టుట చేయరాదు. నూతన గృహ ప్రవేశము చేసుకొనవచ్చును.

 

కుజ చార ఫలము

ఈ సంవత్సరంలో కుజ భ పునర్వసు నుండి శతభిషం వరకు సంచరించును. 06.11.2025 పడమర కుజాస్తమయం. ఫలం – సుభిక్షం, రాజ భయం. ఉదయ మరియు వక్రీ ఈ సంవత్సరంలో ఏర్పడలేదు.

 

గురు చార ఫలము:

ఈ సంవత్సరంలో బృహస్పతి వృషభ, మిథున మరియు కర్కాటక రాశులందు సంచరించును.

సంవత్సరాది నుండి 13.05.2025 వరకు – వృషభం,

14.05.2025 నుండి 18.10.2025 వరకు – మిథునం,

19.10.2025 నుండి 04.12.2025 వరకు – కర్కాటకం

05.12.2025 నుండి వత్సరాంతం వరకు – మిథున రాశిలో సంచారము.


గురోః వృషభ రాశి సంచార ఫలమ్:

వృషభరాశి గతే జీవే పశు స్త్రీ శిశునాశనం

మధ్యవృష్టి సస్స్య హాని ర్నృపాణాం సమరం భవత్ ।।

పశువులకు స్త్రీలకూ బాలురకు హాని. సస్యపీడ. రాజులకు యుద్ధ భయం. మధ్యమ వృష్టి


గురోః మిథున రాశి సంచార ఫలమ్:

సురేంద్రవంద్యే భువి యుగ్మరాశి గతే క్షితీశాః కలహోత్సుకాస్యు ।।

తేర్భయం శస్త్రభయం ప్రజా నాం క్వచిత్ప్రవర్షన్తి వయోధరాశ్చ ।।

రాజులు యుద్ధము నందు అభిప్రాయాన్ని మరియు శ్రద్ధను కలిగి ఉంటారు. ప్రజలకు ఈతి బాధలు శస్త్ర భయాలు అధికంగా ఉంటాయి. అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి.


గురోః కర్కాటక రాశి సంచార ఫలం:

బృహస్పతౌ కర్కాట రాశి సంస్థే గావశ్చమేఘాశ్చవయః ప్రదాస్స్యుః

సస్స్యాభివృద్ధిశ్చ భవేద్ధరిత్ర్యాం సదా ద్విజాశ్చాద్వరత త్సరాస్యుః ।।

బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించు సమయంలో, ఆవులు చక్కగా పాలిస్తాయి. మేఘాలు వర్షిస్తాయి. పంటలు సమృద్ధిగా ఫలిస్తాయి. బ్రాహ్మణులు శ్రద్ధ భక్తితో స్వకర్మలను ఆచరిస్తారు.

 

శని సంచార ఫలము:

వత్సరాది నుండి ఫాల్గుణ అమావాస్య (29.03.2025) వరకు కుంభం

అటుపిమ్మట వత్సరాంతం వరకు మీన రాశి

కుంభ రాశిలో శని ఫలం:


శనేః ఘటస్థే సతి వృష్టినాశో రాజ్ఞాంభయం సస్యలయో నరాణాం ।

భిషగ్వరాణాంచ కవీశ్వరాణాం కోశాధి పానాంచ మహద్భయంస్యాత్ ।।

కుంభ రాశిలో శని సంచారం వలన వృష్టి నాశనము, రాజ భయము, అనావృష్టి, యుద్ధ భయం, సస్స్య నాశనము, వైద్యులకు, కవులకు, ధనాధిపతులకు భయం అధికం. కాని, ఇట్టి సంచారము మగధ దేశాధిపతులు (మగధ ప్రాంత రాష్ట్రాలు మరియు జిల్లాలకు), ధనవంతులకు విజయ ప్రాప్తిని సూచించు చున్నది. ఇట్టి గోచార ప్రభావము వలన రోగ పీడ క్రమముగా తగ్గు సూచనలున్నాయి.

ధనిష్టా నక్షత్ర సంచార సమయంలో – ధనవంతులకు మగధ దేశాధిపతులకు విజయము.

శతతార – పూర్వాభాద్ర నక్షత్ర ద్వయ సంచారంలో వైద్యులకు, కవులకు, మంత్రులకు మరియు నీతిశాస్త్ర కోవిదులకు హానికరము.

మీన రాశిలో శని ఫలం:

మీన స్థితే సూర్యమతి ధరిత్రీ వినష్టసస్యా వివిధాన మృత్యుః

సద్యశ్చ గావో వనిత హిరణ్యం మృగ్యం భవేద్ధారుణ కర్మ భూయః ।।

మీన రాశిలో శని సంచారము వలన సస్య నాశనము, అపమృత్యువు. గోవులు, స్త్రీలు మరియు బంగారు అరుదగును. దారుణ కర్మలు పెరిగిపోతాయి.

 

అథ ప్రత్యబ్ద యోగ పంచక ఫలం:

1)    జ్యేష్ఠ శు ప్రతిపద వార ఫలం – బుధవారం

సుభిక్షం క్షేమారోగ్యం – వృష్టి సస్స్య వివర్ధనం

ధర్మయుక్తా స్సదా భూపాః జ్యేష్టాదౌసౌమ్యవాసరే ।।

దేశం సుభిక్షం, ప్రజలు క్షేమ ఆరోగ్యాలను కలిగి ఉంటారు. వర్షముల వలన పంటలు చక్కగా పండుతాయి. రాజులు ధర్మాసక్తిని కలిగి ఉంటారు.


2)   ఆషాఢ శు పఞ్చమి – సోమవారం

ఆషాఢసిత పంచమ్యామ్ ఇందువారో యదా భవేత్

సుభిక్షం క్షేమమారోగ్యం సువృష్టిశ్చ భవేద్ధ్రువమ్ ।।

ఆషాఢ మాస శుక్ల పక్షంలో పఞ్చమి నాడు సోమవారం అగుట వలన సుభిక్షం, క్షేమం, ఆరోగ్య మరియు సువృష్టి కలుగుతాయి.

 

3)   ఆషాఢ శుక్ల నవమి – చిత్త నక్షత్ర ఫలం:

ఆషాఢస్య సితేపక్షే నవమీ త్వష్ట్రుసంయుతా

సర్వసస్స్య సమృద్ధిస్స్యాత్పృమోదంతే నిరామయాః ।।

ఆషాఢ శుక్ల నవమి చిత్త నక్షత్ర యుక్త అయిన ఎడల సర్వ సస్స్య సమృద్ధి, ప్రజలు సంతోషంగా ఉంటారు.

 

4)   ఆషాఢ బ ఏకాదశి యుక్త రోహిణి నక్షత్ర ఫలం

ఆషాడే కృష్ణపక్షేతు రోహిణ్యేకాదశియుత

సర్వధాన్యాభివృద్ధిస్స్యా త్సువృష్టిశ్చ మహీతలే ।।

ఆషాఢ బ ఏకాదశి యుక్త రోహిణి నక్షత్రం అయినందున సర్వ ధాన్యాభివృద్ధి, సువృష్టి కలుగును.

 

5)   పౌష్య బ అమావాస్య – ఆదివారం – ఫలం – వ్యాధి

 

మకర సంక్రాంతి పురుష లక్షణం:

ఏతద్వత్సరే పుష్య బ ఏకాదశి బుధవారం – అనురాధ నక్షత్ర యుక్త – గండయోగ – బాలవ కరణ మందు ఉత్తరాషాఢ నక్షత్ర ౨ చరణము మకరే రవిః గం 03:07 ని.

అష్టకర్ణో విశాలాక్షో లంబ భ్రూర్దీర్ఘ నాశికః

అష్టబాహుశ్చతుర్వక్త్ర స్సంక్రాంతి పురుషస్మృతః

శత యోజన మౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశ స్మృతం

ఏవమ్ రూపం హి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతేః ।।

సంక్రాంతి పురుషుడు 8 పెద్ద చెవులు, వెడల్పుగా ఉన్న కళ్ళు, ‘భ్రూ’ ప్రాంతం పొడవుగా ఉంటుంది, పొడవైన నాసిక గల వాడు, వంద యోజనాల ఎత్తు, పన్నెండు యోజనాల విస్తీర్ణం గల రూపం గల పురుషుడని తెలియుచున్నది. ఆయన రూపం చూడడానికి ఒక విజ్ఞుడి వలే ఉంటుంది.

ఆయన నామధేయం: ‘మందాకినీ’ – ఫలం – రాజులకు అరిష్టం

కుంకుమ స్నానం – శుభం

తిథి (ద్వాదశి) ఫలం: సుఖము

కృష్ణ పక్షం: సుభిక్షం క్షేమం ఆరోగ్యం

నక్షత్ర (అనురాధ): సువృష్టి

వార (బుధవారం): సువృష్టి, సస్య సంపత్తి

కాల (రాత్రి): పిశాచ నాశనం

లగ్న (సింహ): పురుష చింత

పీత వస్త్ర ధారణ: యుద్ధ భయం

కుంకుమ గంధ లేపనం: స్త్రీ నాశనం

పగడ పుష్ప ధారణ: ఆకలి భయం

రజిత భూషణ: ధరలు పెరుగును

రాగి పాత్ర భోజనం: లోహ నాశనం

భక్ష్య పానం: ప్రజా నాశనం

చూత ఫల (మామిడి పండు) భక్షణం: నటనం అరిష్టం

ఖడ్గ శస్త్ర ధారణ: అగ్ని భయం

పీత ఛత్ర ధారణ: శుభప్రదం

వరాహ వాహన ఫలం: రాజ పీడ

లజ్జా ముఖం: అధిక వర్షం

చోద్యా స్థితి: ఉత్తమ వృష్టి

దక్షిణ దిగ్యాన: దక్షిణ ప్రాంతాలకు క్షామం

పంతొమ్మిదవ ముహూర్త: - శుభం

 

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయము:

 

గురు మౌఢ్యమి:

09.06.2025, జ్యేష్ఠ శు చతుర్దశి, సోమవారం, 17:40

నుండి

10.07.2025, ఆషాఢ శు చతుర్దశి, గురువారం, 00:07

 

శుక్ర మౌఢ్యమి:

26.11.2025, మార్గశిర శు షష్టి, బుధవారం, 11:07

నుండి

17.02.2026, మాఘ అమావాస్య, మంగళవారం, 14:07

 

 పుష్కర నిర్ణయము:

అస్మిన్ వర్షే వైశాఖ బ విదియ, సౌమ్య వాసరే, తేది 14.05.2025, ఉ గం 09:18 ని, మృగశిర తృతీయ చరణే, మిథున రాశ్యాం బృహస్పతి ప్రవేశః. 14.05.2025 మొదలు 26.05.2025 వరకు సరస్వతి నదికి పుష్కరాలు. ఇట్టి పుణ్య దినము లందు సరస్వతి నదీ స్నానాలు, పిండ ప్రధానము, దాన ధర్మాదులు నిర్వహించినచో పితృ దేవతలు తరించెదరు.

పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు:
మొదటి రోజు:-         సువర్ణ, రజత, ధాన్య, భూ దానాలు.
రెండవ రోజు:-          వస్త్ర, లవణ, రత్న దానాలు.
మూడవ రోజు:-        గుడ (బెల్లం), అశ్వ శాఖ, ఫల దానాలు.
నాల్గవ రోజు:-           ఘృతం (నెయ్యి), తైలం (నూనె), క్షీరం (పాలు), మధు (తేనె) దానాలు.
ఐదవ రోజు:-           ధాన్యం, శకట, వృషభ, హల దానాలు.
ఆరవ రోజు:-            ఔషధ, కర్పూర, చందన, కస్తూరి దానాలు.
ఏడవ రోజు:-            గృహ, పీట, శయ్య దానాలు.
ఎనిమిదవ రోజు:-       చందనం, కందమూల, పుష్ప మాల దానాలు.
తొమ్మిదవ రోజు:-       పిండ, దాసి, కన్యా, కంబళి దానాలు.
పదవ రోజు:-           శాకం (కూరగాయలు), సాలగ్రామ, పుస్తక దానాలు.
పదకొండవ రోజు:-       గజ దానం.
పన్నెండవ రోజు:-       తిల (నువ్వులు) దానం.

తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు, సంతాన లేమితో బాధపడుతున్న వారికి ఇట్టి దానాలు ఉపశమనాన్ని ప్రసాదించు సూచనలున్నాయి.

 

గ్రహణ నిర్ణయము:

 

పింగళ వర్ణ రాహుగ్రస్త సవ్య సంపూర్ణ చన్ద్ర గ్రహణం:

భాద్రపద శు పౌర్ణమి భానువాసరే తేది 07.09.2025, శతభిష నక్షత్ర, మేష లగ్న, కుంభ రాశి.

స్పర్శ               21:57

నిమీలనం           23:01

మధ్య               23:41

ఉన్మీలనం (08/09)  00:22

మోక్షం (08/09)     01:26

పూర్ణిమా ప్రయుక్త నిత్య భోజన ప్రత్యాబ్దికాలు మధ్యాహ్నాత్పూర్వం గం 01:00 లోగా ముగించాలి.

గ్రహణ గోచార ఫలం:

ఇట్టి గ్రహణాన్ని శతభిష, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారు వీక్షించ రాదు. వీరు గ్రహణ శాన్తి జరుపుకోవాలి.

కర్కాటక – వృశ్చిక – కుంభ – మీన – రాశుల వారికి అధమ ఫలం

మిథున – సింహ -  తుల – మకర – రాశుల వారికి మధ్యమ ఫలం

మేష – వృషభ – కన్య – ధనుస్సు – రాశుల వారికి శుభకరము.

 

ముచ్యమనోదయ పాక్షిక చన్ద్ర గ్రహణం:

03.03.2026, ఫాల్గుణ శు పౌర్ణమి, మంగళవారం, పూర్వాఫల్గుణి నక్షత్ర యుక్త సింహ రాశి యందు కిఙ్చ న్యూన పాదాధికం కేతుగ్రస్త కృష్ణవర్ణ పాక్షిణ చన్ద్ర గ్రహణం – ఈశాన్యాసన్నే మోక్షః

 

స్పర్శ         15:20

నిమీలనం     16:34

మధ్య         17:03

ఉన్మీలనం     17:32

చంద్రోదయ    18:17

సూర్యాస్తమయ   18:18

మోక్షం        18:47

 

నిత్య భోజన ప్రత్యాబ్దికాలు:

గ్రహణము గ్రస్తోదయం అగుట వలన పగలు భుజించ రాదు. గ్రహణానంతరం శుద్ధి చేసుకొని పచన భోజనాలు, ప్రత్యాబ్దికాలను నిర్వహించుకోవాలి. వృద్ధులు, బాలలు, రోగగ్రస్తులు, గర్భిణి స్త్రీలు ఇత్యాది వారు ప 12:00 లోగా ఆహారం తీసుకోవాలి.

 

గ్రహణ గోచారం:

పుబ్బ నక్షత్ర జాతకులు, సింహ, కన్య, మకర, కుంభ, వృషభ రాశుల వారు వీక్షించరాదు. వీరు గ్రహణ శాన్తి జరుపుకోవాలి.

 

 ఆదాయ వ్యయాలు:


రాశి ఆదాయము వ్యయము

మేషము 2 14

వృషభము 11 5

మిథునము 14 2

కర్కాటకము 8 2

సింహము 11 11

కన్య 14 2

తుల 11 5

వృశ్చికము 2 14

ధనుస్సు 5 5

మకరము 8 14

కుంభము 8 14

మీనము 5 5

 

 

రాజ పూజ్య రాజావమానము:

 

రాశి రాజ పూజ్యము రాజావమానము

మేషము 5 7

వృషభము 1 3

మిథునము 4 3

కర్కాటకము 7 3

సింహము 3 6

కన్య 6 6

తుల 2 2

వృశ్చికము 5 3

ధనుస్సు 1 5

మకరము 4 5

కుంభము 3 5

మీనము 3 11

  

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలం:

 

శ్రీ విశ్వావసు నామ సం సాయన వర్శారంభం 29.03.2025 @ 16:28, కన్యా లగ్నం. మరియు నిరాయణ వర్శారంభం సింహ లగ్నం. నిరాయణ వర్ష లగ్న వశాత్తు సప్తమ స్థానమున శని, అష్టమ రవి చన్ద్ర బుధ శుక్ర రాహువులు, దశమ స్థానమున గురు భ మరియు ఏకాదశ లాభ స్థానమున కుజ భ. నవ నాయకులు అధిక శాతం శుభ గ్రహలై ఉండుట మరియు రాజు రవి భ అగుట శుభప్రదము. నిరాయణ లగ్న వశాత్తు గల గ్రహ స్థితులు కుజ మరియు గురు భ మినహా మిగిలినవన్నీ ప్రతికూల స్థానములందు ఉండుట.

 

ఇట్టి సంవత్సరంలో శుభ ఫలితాల కంటే కూడా ప్రతికూల ఫలితాలు అధికంగా లభించు సూచనలున్నాయి.

·         లగ్న వశాత్తు రాజ్య స్థానమున గురు భ వలన దేశంలో ధర్మబద్ధమైన పాలనను సూచించు చున్నది. సనాతన ధర్మం చక్కగా కాపాడబడుతుంది. రాజులు మరియు ప్రజలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టడంలో అధిక ఆసక్తిని కనబరచు వారగు సూచనలున్నాయి. వృషభ రాశిలో గురు సంచారం వలన క్షితిపతి అనగా దేశ నాయకుడు ధర్మ బద్ధుడై పరిపాలనను అందించగలడు.

·         దశమ స్థానమున గురు భ వలన మరియు ఏకాదశ లాభ స్థానములందు కుజ భ వలన దేశ మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి చక్కగా ఉన్నను, లగ్న వశాత్తు సప్తమ స్థానమున శని భ వలన అట్టి అభివృద్ధి సంతృప్తికరంగా ఉండదు. ఆర్థికాభివృద్ధి మందగతిన సాగుతూ ఉంటుంది. అష్టమ స్థానమున చన్ద్ర రాహువు బుధ భ వలన స్టాక్ మరియు షేర్ మార్కెట్ లందు అనిశ్చితి అధికంగా ఉంటుంది. ప్రజలు స్పెక్యులేటివ్ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ప్రజలపై మరియు దేశంపై రుణభారం పెరుగుతుంది.

·         రియల్ ఎస్టేట్ అభివృద్ధి మందగతిన సాగుతూ ఉంటుంది. ఆస్తులందు భారీ వ్యాపార పరమైన పెట్టుబడులు నిలచిపోవు సూచనలున్నాయి.

·         ఆర్ధిక రంగ సంస్థల అభివృద్ధి చక్కగా ఉన్నను ఇట్టి అభివృద్ధి మందకొడిగా సాగుతూ ఉంటుంది.

·         అష్టమ స్థానమున ఏర్పడిన పఞ్చ గ్రహ కూటమి వలన ప్రజలందు అనారోగ్య భయం లేదా పీడ అధికంగా ఉంటుంది.

·         ప్రజలు కోపోద్రేకాలతో జీవిస్తూ ఉంటారు.

·         యువత మత్తు పదార్థాలను సేవించడంలో అధిక శ్రద్ధను కనబరచు వారు. మత్తు పదార్థాల విక్రయం పెరిగిపోతుంది. సులభ మార్గాలలో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

·         విద్య రంగ సంస్థల అభివృద్ధి చక్కగా ఉంటుంది.

·         ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అభివృద్ధి మందకొడిగా సాగుతూ ఉంటుంది.

·         అష్టమ స్థానమున ఏర్పడ్డ గ్రహ కూటమి వలన దేశంలో అరాచక, అసాంఘిక కర్యాక్రమాలు పెరిగి పోతాయి. ఉగ్రవాదం కూడా పెరుగుతుంది. ఉగ్రవాదులు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను అధిక విక్రయిస్తారు.

·         దేశంలో ఏదో ఒక చోట, ఏదో ఒక అనిశ్చితి కొనసాగు సూచనలున్నాయి.

·         మీన రాశిలో చతుర్గ్రహా, పంచాగ్రహ మరియు షట్గ్రహా కూటమి. ఇట్టి గ్రహ కూటమి వలన మరియు 30.05.2025 మొదలు 04.06.2025 వరకు కాలసర్ప యోగము – దేశ అరిష్టము, పాలకులకు, దేశానికి రాజ్యానికి ఊహించని విపత్తులు.


మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలాలు:

(ఇట్టి గోచార ఫలాలు అందరికి ఒకే విధంగా ఉండవు. ఇట్టి ఫలితాలను జాతక రీత్యా ఉన్న యోగాలు మరియు జన్మ కాల దశలు ప్రభావితం చేయు సూచనలున్నాయి. తత్ప్రభావము వలన ఇట్టి శుభాశుభ ఫలాలు మారు సూచనలున్నాయి. జాతక పరమైన యోగాల ప్రభావము వలన అత్యంత శుభప్రదమైన గోచార సమయంలో ప్రతికూల ఫలాలను పొందవచ్చు లేదా అత్యంత ప్రతికూల గోచారము నందు శుభ ఫలాలను కూడా పొందవచ్చు. మనం ఆచరించిన కర్మలను అనుసరించి వాటికి సరిపడా యోగాలు గల సమయంలో మనం జన్మిస్తాము. తదనుగుణంగా ఫలితాన్ని అనుభవిస్తాము)

 

శని:

వత్సరాంతం వరకు మీన రాశిలో సంచారం

 

గురు:

14.05.2025 వరకు వృషభ రాశిలో సంచారం

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున రాశిలో

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకం

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునం

ఈ సంవత్సరం బృహస్పతి ౩ రాశులలో సంచరిస్తాడు.

 

రాహువు:

18.05.2025 వరకు మీన రాశిలో సంచారం అటుపిమ్మట కుంభం.

18.05.2025 నుండి వత్సరాంతం వరకు కుంభ రాశి.

 

మేషం:

మేష రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలాలు అధికంగా లభిస్తాయి. శని, గురు మరియు రాహువు భ ప్రతికూల ఫలాన్నే ఇస్తారు.

 

గురు గోచారము:

14.05.2025 వరకు ధన స్థానమున గురు భ శుభుడు. కుటుంబ సౌఖ్యము. కీర్తి వృద్ధి, ధన లాభము, ధనాదాయము, దాన ధర్మాల నిర్వాహణ, చక్కని ఆర్థికాభివృద్ధి. రావలసిన ధనము అందుట. సమయానుసారంగా ధనము అందుట. శుభకార్యాలు. విద్యార్థి మరియు వ్యాపారులకు శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట. చక్కని కార్యసిద్ధి. అటుపిమ్మట వత్సరాంతం వరకు కూడా గురు భ ప్రతికూల ఫలాలనే ఇస్తాడు. భ్రాతృ విరోధం, తలపెట్టిన పనులందు ఆటంకాలు, అధిక ధన వ్యయం, బంధు విరోధం. అటుపిమ్మట సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయానికి మించిన వ్యయం, స్థాన చలనం, ధన నష్టం, అనారోగ్యం ఇత్యాది ప్రతికూల ఫలాలు లభిస్తాయి. వీరికి 14.05.2025 వరకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అటుపిమ్మట వత్సరాంతం వరకు అనుకూలించవు.

 

శని గోచారము:

ఏలినాటి శని. అధిక ధన వ్యయము. వృధా ఖర్చులు. పెట్టుబడులందు నష్టాలు. ఊహించని ఖర్చులు. సమయానుసారంగా ధనం ఖర్చై పోతుంది. వివాదాలు, పరస్పర దూషణలు. అనవసరంగా దూషించే వారి సంఖ్యా అధికమౌతుంది. విచారము. అపకీర్తి. వృధా సంచారము. శారీరిక శ్రమ. ఉద్యోగ భంగము. క్రొత్త మరియు భారీ పెట్టుబడులు చేయునపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి పెట్టుబడులు నిలిచి పోవుట మరియు వివాదాలు అధికమగు సూచనలున్నాయి. మిత్రులు, సంబంధీకులు మరియు సన్నిహితుల సంబంధాలలో జాగ్రత్త వహించాలి. విరోధము మరియు విభేదాలు అధికమగు సూచనలున్నాయి. ఖర్చులు విపరీతంగా పెరిగి పోతాయి. వివాదాలు ప్రారంభమౌతాయి. సంయమనాన్ని పాఠించాలి. కొన్ని అనుకూల ఫలాలు కూడా లభిస్తాయి. అట్టి ఫలాలను చూసి పొంగిపోరాదు. అవే కష్టాలుగా మారే సూచనలు ఉంటాయి. అత్యుత్సాహం పనికిరాదు.

 

రాహువు గోచారము:

18.05.2025 వరకు వ్యయ స్థానంలోను రాహువు ప్రతికూలుడు. కార్య విఘ్నము, భార్య భర్తల మధ్య కలహాలు, శత్రు వృద్ధి, అనుకోని ఒడుదుడుకులు, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట, మనో వ్యాకులత. స్థాన చలనము, శారీరిక శ్రమ అధికం, అవమానాలు, వృధా ఖర్చులు, వివాదాలు, నేత్ర సంబంధమైన చిక్కులు, అకారణంగా కలహాలు, అనవసరమైన వివాదాలు. పాపకార్య చింతన ఇత్యాది ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

అటుపిమ్మట వత్సరాంతం వరకు లాభ స్థానమున శుభుడు. శీఘ్ర కార్యసిద్ధి, ధన మరియు నూతన వస్త్ర లాభం, చక్కని కార్య సానుకూలత ఇత్యాది శుభ ఫలితాలు లభిస్తాయి.

 


వృషభము:

వీరికి ఈ సంవత్సరంలో శుభ ఫలితాలే అధికంగా లభిస్తాయి. వత్సరాంతం వరకు లాభ స్థానమున శని మరియు ధన స్థానమున గురు భ శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. రాహువు మాత్రం స్వల్ప ప్రతికూల ఫలాలను ప్రసాదించు సూచనలున్నాయి.

 

గురు గోచారము:

14.05.2025 వరకు ప్రతికూల గోచారము వలన స్థాన చలనము, నివాసంలో మార్పు, దూర ప్రాంతాలకు బదిలీ, వ్యర్థ సంచారము, మానసిక చింత, వస్తు నాశనం, ఉద్యోగ భంగ యోగాలు, ధార్మిక కార్యాలలో పాలుపంచుకుంటారు. విద్యార్థులకు మిశ్రమ ఫలాలు, వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. అనారోగ్యము. గ్రంథులు మరియు హార్మోన్ సంబంధిత సమస్యలు.

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున రాశిలో:

శుభ ఫలితాలని ఇస్తాడు. కుటుంబ సౌఖ్యం, ధన లాభం, కీర్తి వృద్ధి, రావలసిన ధన సమయానికి అందుట, దాన ధర్మాల నిర్వాహణ, సర్వత్ర శుభ ఫలితాలు. ఇట్టి సమయంలో వీరు చేసే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకం:

పనులందు ఆటంకాలు అధికంగా ఉంటాయి. అధిక ధన వ్యయం. బంధు విరోధం ఇత్యాది ప్రతికూల ఫలాలు.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునంలో శుభుడు. పైన తెలిపిన శుభ ఫలితాలన్నీ లభిస్తాయి.

 

రాహువు:

18.05.2025 వరకు లాభ స్థానమున శుభుడు. శీఘ్ర కార్యసిద్ధి, ధన మరియు నూతన వస్త్ర లాభం, చక్కని కార్య సానుకూలత ఇత్యాది శుభ ఫలితాలు లభిస్తాయి. అటుపిమ్మట వత్సరాంతం వరకు ప్రతికూలుడు. వృధా సంచారము, పనులందు ఒడుదుడుకులు అధికం, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోతూ ఉంటాయి. ఆహార వ్యతిరేకత, కార్యక్షేత్రంలో ప్రతికూలత. వృత్తి మరియు వ్యాపార పరమైన అనిశ్చితి.

 

 

మిథునము:

వీరి అధిక శాతం ప్రతికూల ఫలాలే లభిస్తాయి. స్వల్ప కాలానికి గురు భ శుభుడు అగుట వలన కొంత ఉపశమనం మాత్రమే లభించు సూచనలున్నాయి.

 

గురు గోచారము:

14.05.2025 నుండి 18.10.2025, 05.12.2025 నుండి వత్సరాంతం వరకు – వ్యయ మరియు జన్మ రాశులలో సంచారం. వత్సరాంతం వరకు గురు భ ప్రతికూల ఫలాలను ప్రసాదించును. స్థాన చలనము, ధన నష్టము, పెట్టుబడు లందు నష్టాలు, వృత్తి లేదా పదవీ భంగము, వ్యర్థ ప్రయాణాలు. భ్రాతృ విరోధం. విద్యార్థులకు, ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ప్రతికూల ఫలాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. ఉద్యోగ భంగ యోగాలు.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకం – ధన స్థానమున శుభుడు.

ధన లాభం. కుటుంబ సౌఖ్యం. ధార్మిక కార్యాలు నిర్వహించుట. వివాహ ప్రయత్నాలందు అనుకూలత.

 

శని గోచరము:

వత్సరాంతం వరకు కూడా దశమ స్థానమున శని భ ప్రతికూలుడు. మనో వ్యాకులత, పాప కార్యాచరణ, ఉద్యోగ నష్టము, వ్యవహార నాశనము, పనులు సమయానుసారంగా వెనకబడుట, శ్రమతో కూడిన ఫలాలు. అధిక శ్రమ మరియు స్వల్ప ఫలం.

 

రాహువు గోచారము:

తలపెట్టిన పనులందు ఒడుదుడుకులు అధికం. ఉన్నత అధికారుల ద్వారా సమస్యలు, స్థాన చలనం, అదృష్టం కలిసి రాకపోవుట. వృధా సంచారం. వృత్తి మరియు వ్యాపార పరమైన అనిశ్చితి.

 

 

కర్కాటకము:

కర్కాటక రాశిలో జన్మించిన వారికి ప్రతికూల ఫలాలు అధికంగా లభించు సూచనలున్నాయి.

 

గురు గోచారము:

14.05.2025 వరకు గురు భ శుభుడు. అన్నింటా లాభము, కీర్తి మరియు తేజో వృద్ధి, బల సంపన్నత, విజయ ప్రాప్తి, పదోన్నతులు, విద్యార్థులకు శుభ ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించుట, సంతాన సౌఖ్యము, వృత్తి పరంగా ధన లాభము. భాగస్వామ్య వ్యవహారము లందు లాభము. వ్యాపారులకు అనుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలయందు అనుకూలత.

14.05.2025 నుండి వత్సరాంతం వలన గురు భ ప్రతికూలుడు. కార్య విఘ్నాలు, ఆరాటం అధికం. స్థాన చలనం, పదవీ భంగం. కాని ఇట్టి ప్రతికూల ఫలాలు కాస్త తక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి గురు భ ఉచ్ఛ రాశి అగుట వలన ప్రతికూల ఫలాలు నిమ్న స్థాయిలో ఉంటాయి.

 

శని గోచారము:

దుఃఖము, ఆదాయం క్షీణించుట, తలపెట్టిన పనులు కుంటుబట్టుట, పితృ అనారోగ్యము కలవర పెట్టుట, లాభించే చోట నష్టం, అదృష్టం కలిసి రాకపోవుట. లాభాలు క్షీణించుట. ఇట్టి గోచార ఫలం అష్టమ శని కంటే కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది.

 

రాహువు గోచారము:

వత్సరాంతం వరకు రాహువు ప్రతికూలుడు. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు, వ్యవహారము మందగించుట, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, ఎలర్జీ సంబంధిత సమస్యలు, కార్య ప్రతికూలత, గౌరవ మర్యాదలు క్షీణించుట.

 

 

సింహము:

వీరికి మిశ్రమ ఫలాలు అధికంగా లభిస్తాయి. కొంత శుభ ఫలం, అధిక శాతం ప్రతికూల ఫలం.

 

గురు గోచారము:

14.05.2025 వరకు వృషభ రాశిలో ప్రతికూలుడు. తలపెట్టిన కార్యము లందు అవరోధాలు, వృధా సంచారము, వృత్తి పరమైన మార్పులు, దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్రాల దర్శనము, విద్యార్థులకు ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు అనుకూలించక పోవుట.

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున రాశిలో శుభుడు. తలపెట్టిన పనులందు లాభము. పనులు విజయవంతముగా ముగియుట. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుట, పదోన్నతులు, ధన లాభం, వివాహ ప్రయత్నాలందు అనుకూలత.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకంలో ప్రతికూలుడు. కార్య విఘ్నాలు, ఆరాటం అధికం. స్థాన చలనం, పదవీ భంగం ఇత్యాది ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో శుభుడు. తలపెట్టిన పనులందు లాభము. పనులు విజయవంతముగా ముగియుట. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుట, పదోన్నతులు, ధన లాభం, వివాహ ప్రయత్నాలందు అనుకూలత.

 

 శని గోచారము:

వత్సరాంతం వరకు శని అష్టమ స్థానమున ప్రతికూలుడు. ఆపదలు, అనారోగ్య సమస్యలు, స్వజనులకు నష్టము, భాగస్వాములతో విభేదాలు, ద్వేషాలు అధికమగుట, ధన నష్టము, పెట్టుబడులు నిలచిపోవుట, చేయని తప్పుకు బాధ్యులను చేయుట, నిష్ఠూరము, శిక్షాప్రాప్తి, అవమానాలు. పనులు సమయానుసారంగా వెనకబడుట, వృత్తి రీత్యా మందగించు అభివృద్ధి, సంతాన రీత్యా ఎదురగు ప్రతికూలతలు. స్వల్ప అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, స్వల్ప ప్రమాదాలు, మలబద్దకం నకు చెందిన చిక్కులు, నేత్ర మరియు దంత సంబంధిత సమస్యలు.

 

రాహువు గోచారము:

వత్సరాంతం వరకు రాహువు అష్టమ మరియు సప్తమ స్థానములందు ప్రతికూలుడు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఎలర్జీ సంబంధిత మరియు కలుషిత ఆహార సంబంధిత సమస్యలు, ఋణ భీతి, తలపెట్టిన కార్యాలు కలిసి రాకపోవుట. అధికారుల నుండి సమస్యలు, స్థాన చలనం, భాగస్వామ్య వ్యవహారాలు కలిసి రాకపోవుట. మానసిక ఒత్తిడి. ఇత్యాది ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

 

 

కన్య:

కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో స్వల్ప శుభ మరియు అధికశాతం ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

 

గురు గోచారము:

14.05.2025 వరకు వృషభ రాశిలో సంచారం - గోచార రీత్యా వత్సరాంతం వరకు గురు భ శుభుడు. స్థిరాస్తుల పరంగా లాభము, తపోలాభము, ఉపాసనలు సిద్ధించు సమయం, కుల వృత్తు లందు చక్కని రాణింపు. చక్కని కార్యసిద్ధి. తలపెట్టిన పనులందు అనుకూలత. నూతన  ఉద్యోగ అవకాశాలు. పదోన్నతులకు అనుకూలమైన సమయము. దైవ చింతన, అన్ని విధాలుగా ఆహ్లాదకరమైన గృహ వాతావరణం. సంతాన పరంగా అనుకూలత. వివాహ ప్రయత్నము లందు అనుకూలత. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున రాశిలో ప్రతికూలుడు. తలపెట్టిన పనులందు విఘ్నాలు. వృధా సంచారం, వృత్తిలో ప్రతికూలత. ధన వస్తు లాభం.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకంలో శుభుడు. తలపెట్టిన పనులందు లాభము. పనులు విజయవంతముగా ముగియుట. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుట, పదోన్నతులు, ధన లాభం, వివాహ ప్రయత్నాలందు అనుకూలత. భాగస్వామ్య వ్యవహారాలు లాభించుట. ఆస్తుల ద్వారా ధన లాభము. వివాహ ప్రయత్నాలు అనుకూలించుట.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునంలో ప్రతికూలుడు. తలపెట్టిన పనులందు విఘ్నాలు. వృధా సంచారం, వృత్తిలో ప్రతికూలత. ధన వస్తు లాభం.


శని గోచారము:
వత్సరాంతం వరకు శని భ సప్తమ స్థానమున ప్రతికూలుడు. వృధా ప్రయాణాలు, ప్రయాణాలు అనుకూలించక పోవుట, భాగస్వాములతో విభేదాలు, భాగస్వామ్య వ్యవహారము లందు ప్రతికూలతలు, మనో వేదన, విదేశీయాన యోగాలు ఫలించక పోవుట,  మిశ్రమ మరియు ప్రతికూల ఫలాలు లభిస్తాయి. పనులు సమయానుసారంగా వెనకబడుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలమ్ లభించక పోవుట. ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తగ్గుట. వృత్తి మరియు వ్యవహారము మందగించుట. వృత్తి పట్ల శ్రద్ధ తగ్గుట. అనారోగ్యము. కీళ్ళు, నడుము, గర్భాశయ ఇత్యాది సమస్యలు. కళత్ర అనారోగ్య చింత.

 

రాహువు గోచారము:

18.05.2025 వరకు మీన రాశిలో సంచారం - ఎలర్జీ లకు చెందిన చిక్కులు. అనుకోని ఒడుదుడుకులు. భాగస్వామ్య వ్యవహారము లందు ప్రతికూలతలు. ఉదర మరియు నేత్ర సంబంధిత సమస్యలు, ఊహించని మార్పులు, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. కుటుంబ కలహాలు. బంధు మిత్ర విరోధము.

18.05.2025 నుండి వత్సరాంతం వరకు కుంభ రాశి – చక్కని కార్యసిద్ధి, కార్య విజయం, సర్వ విధాలా శుభ ఫలాలు. పుణ్యకార్య నిర్వాహణ. ధన లాభం ఇత్యాది శుభ ఫలితాలు లభిస్తాయి.

 

 

తుల:

తులా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు అధికంగా లభిస్తాయి.

 

గురు గోచారము:

14.05.2025 వరకు వృషభ రాశిలో సంచారం - అష్టమ స్థానమున గురు భ ప్రతికూలుడు. గృహ సంబంధ సమస్యలు, మాతృ సంబంధమైన అనారోగ్య చింత, రాజ భయము, పై అధికారులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు, హార్మోనులు మరియు మధుమేహ సంబంధిత సమస్యలు ఎదుర్కొను వారికి అధిక సమస్యలు, కోపము మరియు చిరాకు, ఊహించని అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చొరభయం, ఉద్యోగ మరియు వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. వృత్తి పరమైన చికాకులు అధికమగుట ఇత్యాది ప్రతికూల ఫలాలు పొందగలరు.

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున రాశిలో – అత్యంత శుభ ఫలితాలు. స్థిరాస్తులు. భ్రాతృ పరంగా కలిసి వచ్చుట. తలపెట్టిన కార్యాలలో అదృష్టం కలిసి వచ్చుట. ఉపాసనలు సిద్ధించుట. ధార్మిక కర్మలను ఆచరించుట. బంధుజన ప్రీతి. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుట. వివాహ ప్రయత్నాలందు అనుకూలత.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకంలో ప్రతికూలం - తలపెట్టిన కార్యము లందు అవరోధాలు, వృధా సంచారము, వృత్తి పరమైన మార్పులు, దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్రాల దర్శనము, విద్యార్థులకు ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు అనుకూలించక పోవుట.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునంలో శుభుడు - అత్యంత శుభ ఫలితాలు. స్థిరాస్తులు. భ్రాతృ పరంగా కలిసి వచ్చుట. తలపెట్టిన కార్యాలలో అదృష్టం కలిసి వచ్చుట. ఉపాసనలు సిద్ధించుట. ధార్మిక కర్మలను ఆచరించుట. బంధుజన ప్రీతి. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుట. వివాహ ప్రయత్నాలందు అనుకూలత.

 

శని గోచారము:
వత్సరాంతం వరకు మీన రాశిలో శుభ ఫలాలు లభిస్తాయి. ధన లాభము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు, బంధుజన సంతోషము, చక్కని కార్య సిద్ధి, తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తిచేయ గలుగుట, వృత్తి మరియు వ్యాపార పరంగా కార్య విజయం, శత్రువులపై విజయము. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. సర్వత్రా ఆహ్లాదకరమైన ఫలితాలు.

 

రాహువు గోచారము:

18.05.2025 వరకు మీన రాశిలో శుభుడు. చక్కని కార్యసిద్ధి, కార్య విజయం, సర్వ విధాలా శుభ ఫలాలు. పుణ్యకార్య నిర్వాహణ. ధన లాభం ఇత్యాది శుభ ఫలితాలు లభిస్తాయి.

18.05.2025 నుండి వత్సరాంతం వరకు కుంభ రాశిలో ప్రతికూలుడు. మానసిక ఒత్తిడి, ఆందోళన, అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సంతాన మరియు శత్రు సంబంధిత సమస్యలు, అనారోగ్యం. శ్వాసకోశ సంబంధిత సమస్యలు. ఎలర్జీ సంబంధిత సమస్యలు.

 

 

వృశ్చిక:

వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో శుభ ఫలాలు స్వల్పం గాను మరియు ప్రతికూల ఫలాలు అధికంగా లభిస్తాయి.

 

గురు గోచారము:

14.05.2025 వరకు వృషభ రాశిలో సంచారం - సప్తమ స్థానమున గురు శుభుడు. చక్కని కార్యసిద్ధి. శారీరిక సౌఖ్యం, ఆరోగ్యం, సంకల్ప కార్యసిద్ధి, అధిక ధన లాభం, విద్యార్థి మరియు వ్యాపారులకు శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నము లందు అనుకూలత. సంపూర్ణ ఆనందం. మానసిక ఉల్లాసం. పుత్ర లాభము. సంతానానికి అనుకూలత.

14.05.2025 నుండి 18.10.2025 వరకు అష్టమ స్థానమున మిథున రాశిలో ప్రతికూలుడు. గృహ సంబంధ సమస్యలు, మాతృ సంబంధమైన అనారోగ్య చింత, రాజ భయము, పై అధికారులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు, హార్మోనులు మరియు మధుమేహ సంబంధిత సమస్యలు ఎదుర్కొను వారికి అధిక సమస్యలు, కోపము మరియు చిరాకు, ఊహించని అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చొరభయం, ఉద్యోగ మరియు వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. వృత్తి పరమైన చికాకులు అధికమగుట ఇత్యాది ప్రతికూల ఫలాలు పొందగలరు.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకం భాగ్య స్థానంలో శుభుడు - అత్యంత శుభ ఫలితాలు. స్థిరాస్తులు. భ్రాతృ పరంగా కలిసి వచ్చుట. తలపెట్టిన కార్యాలలో అదృష్టం కలిసి వచ్చుట. ఉపాసనలు సిద్ధించుట. ధార్మిక కర్మలను ఆచరించుట. బంధుజన ప్రీతి. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుట. వివాహ ప్రయత్నాలందు అనుకూలత.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు అష్టమ స్థానమున మిథున రాశిలో ప్రతికూలుడు. గృహ సంబంధ సమస్యలు, మాతృ సంబంధమైన అనారోగ్య చింత, రాజ భయము, పై అధికారులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు, హార్మోనులు మరియు మధుమేహ సంబంధిత సమస్యలు ఎదుర్కొను వారికి అధిక సమస్యలు, కోపము మరియు చిరాకు, ఊహించని అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చొరభయం, ఉద్యోగ మరియు వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. వృత్తి పరమైన చికాకులు అధికమగుట ఇత్యాది ప్రతికూల ఫలాలు పొందగలరు.

 

శని గోచారం:

వత్సరాంతం వరకు పఞ్చమ స్థానమున శని భ ప్రతికూలుడు. పెట్టుబడులు నిలచిపోవుట, ఊహించని ఖర్చులు, అధిక ధన వ్యయం, ప్రమాదాలు, తగాదాలు, వివాహ ప్రయత్నములందు అవరోధాలు, వివాహ ప్రయత్నాలు వెనకబడుట, మానసిక చింత, సంతాన ప్రయత్నాలందు ప్రతికూలతలు, జీర్ణకోశ మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మిత్ర భేదము. అధిక శ్రమ. విద్యార్థులకు పరీక్షలందు అనుకున్నంతగా ఫలితాలు లభించక పోవుట. వృత్తి పరమైన అభివృద్ధి నిలచిపోవుట. సంతాన పరమైన సమస్యలు.

 

రాహు గోచారము:

18.05.2025 వరకు మీన రాశిలో సంచారం. ఆలోచనలు వక్రించుట, పాప కార్యాసక్తి, అనుమానం మరియు భయం, స్వీయ నమ్మకం తగ్గుట, మానసిక ఆందోళన, శ్వాసకోశ మరియు జీర్ణకోశ సంబంధిత సమస్యలు, విద్యార్థులకు పరీక్షలందు తగిన విధంగా ఫలితం లభించక పోవుట. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు సమస్యలను సృష్టించు సూచనలున్నాయి.

18.05.2025 నుండి వత్సరాంతం వరకు కుంభ రాశిలో ప్రతికూలుడు. అనుకోని ఒడుదుడుకులు. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. ఆస్తుల సంబంధమైన సమస్యలు. ఉన్నత విద్య పరముగా ఎదురగు సమస్యలు. శారీరిక శ్రమ అధికం. కార్య విఘ్నము. పైత్య సంబంధిత రోగాలు.

 

 

ధనుస్సు:

ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమ మరియు ప్రతికూల ఫలాలు అధికంగా లభిస్తాయి.

 

గురు గోచారము:

14.05.2025 వరకు వృషభ రాశిలో ప్రతికూల సంచారం. ఉద్యోగ మరియు వృత్తి మార్పిడి. అనూహ్య ఆపద, రాజదండన భయం, చొరభయం, సన్నిహితులు మరియు బంధు మిత్రులతో విరోధము మరియు మనస్పర్థలు. కుటుంబ కలహాలు. ఆస్తులకు చెందిన వివాదాలు. సంతానముతో విభేదము. అనారోగ్యము. సహా ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులతో విభేదాలు. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

14.05.2025 నుండి 18.10.2025 వరకు సప్తమ స్థానము మిథున రాశిలో శుభుడు - చక్కని కార్యసిద్ధి. శారీరిక సౌఖ్యం, ఆరోగ్యం, సంకల్ప కార్యసిద్ధి, అధిక ధన లాభం, విద్యార్థి మరియు వ్యాపారులకు శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నము లందు అనుకూలత. సంపూర్ణ ఆనందం. మానసిక ఉల్లాసం. పుత్ర లాభము. సంతానానికి అనుకూలత. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

18.10.2025 నుండి 05.12.2025 వరకు అష్టమ స్థానం కర్కాటకం ప్రతికూల ఫలాలు - గృహ సంబంధ సమస్యలు, మాతృ సంబంధమైన అనారోగ్య చింత, రాజ భయము, పై అధికారులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు, హార్మోనులు మరియు మధుమేహ సంబంధిత సమస్యలు ఎదుర్కొను వారికి అధిక సమస్యలు, కోపము మరియు చిరాకు, ఊహించని అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చొరభయం, ఉద్యోగ మరియు వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. వృత్తి పరమైన చికాకులు అధికమగుట ఇత్యాది ప్రతికూల ఫలాలు పొందగలరు.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునం - చక్కని కార్యసిద్ధి. శారీరిక సౌఖ్యం, ఆరోగ్యం, సంకల్ప కార్యసిద్ధి, అధిక ధన లాభం, విద్యార్థి మరియు వ్యాపారులకు శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నము లందు అనుకూలత. సంపూర్ణ ఆనందం. మానసిక ఉల్లాసం. పుత్ర లాభము. సంతానానికి అనుకూలత. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

 

శని గోచారము:

వత్సరాంతం వరకు అర్ధాష్టమ శని భ ప్రతికూలుడు. అనారోగ్యము, పనులు మందగించుట, వృత్తి మరియు వ్యాపారము లందు స్తబ్దత, శ్రమకు తగిన ఫలము మరియు గుర్తింపు లభించక పోవుట, కీర్తి నష్టము, ఉద్యోగ భంగ యోగాలు. విద్యార్థులకు తగిన రీతిలో ఫలమ్ లభించక పోవుట. ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తగ్గుట. కీళ్ళ సంబంధిత సమస్యలు. మాతృ సంబంధమైన అనారోగ్యము.

 

రాహువు గోచారము:

18.05.2025 వరకు మీన రాశిలో ప్రతికూలుడు. అనుకోని ఒడుదుడుకులు. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. కార్య విఘ్నము, యంత్రముల ద్వారా ప్రమాదాలు, ఆస్తుల లావాదేవీలందు ప్రతికూలతలు, దుష్టులతో కలహం శారీరిక శ్రమ, సమస్యను త్వరిత గతిన పరిష్కరించే మార్గంలో ఎదురగు ప్రతికూలతలు.

18.05.2025 నుండి వత్సరాంతం వరకు తృతీయ స్థానం కుంభ రాశిలో శుభుడు. చక్కని కార్యసిద్ధి. అనూహ్య ధన ప్రాప్తి, శత్రువులపై విజయం. చెవి ముక్కు మరియు గొంతు సంబంధిత సమస్యలు. సుఖం.

 

 

మకరము:

మకర రాశి వారికి ఏలినాటి శని ముగియుట వలన వత్సరాంతం వరకు శని శుభ ఫలితాలను ఇస్తాడు. గురు భ మాత్రం శుభ మరియు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు.

 

గురు గోచారము:

14.05.2025 వరకు వృషభ రాశి పఞ్చమ స్థానమున శుభ ఫలితాలు. దైవానుగ్రహము, ఉపాసనలు సిద్ధించుట, ఆధ్యాత్మిక చింతన పెంపొందుట. ధన మరియు వస్తు లాభము. ఇష్టకార్య సిద్ధి. తలపెట్టిన పనులు విజయవంతంగా ముగియుట. కీర్తి మరియు ధన లాభము. పదోన్నతులు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట. గృహము నందు శుభ కార్యములు. సంతానాభివృద్ధి. వారికి ధన లాభము. ఆస్తుల ద్వారా లాభము.

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున రాశిలో ప్రతికూలుడు. ఉద్యోగ మరియు వృత్తి మార్పిడి. అనూహ్య ఆపద, రాజదండన భయం, చొరభయం, సన్నిహితులు మరియు బంధు మిత్రులతో విరోధము మరియు మనస్పర్థలు. కుటుంబ కలహాలు. ఆస్తులకు చెందిన వివాదాలు. సంతానముతో విభేదము. అనారోగ్యము. సహా ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులతో విభేదాలు. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకంలో శుభుడు. చక్కని కార్యసిద్ధి. శారీరిక సౌఖ్యం, ఆరోగ్యం, సంకల్ప కార్యసిద్ధి, అధిక ధన లాభం, విద్యార్థి మరియు వ్యాపారులకు శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నము లందు అనుకూలత. సంపూర్ణ ఆనందం. మానసిక ఉల్లాసం. పుత్ర లాభము. సంతానానికి అనుకూలత.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునంలో ప్రతికూలుడు, ఉద్యోగ మరియు వృత్తి మార్పిడి. అనూహ్య ఆపద, రాజదండన భయం, చొరభయం, సన్నిహితులు మరియు బంధు మిత్రులతో విరోధము మరియు మనస్పర్థలు. కుటుంబ కలహాలు. ఆస్తులకు చెందిన వివాదాలు. సంతానముతో విభేదము. అనారోగ్యము. సహా ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులతో విభేదాలు. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

 

శని సంచారం:

వత్సరాంతం వరకు తృతీయ స్థానమున శని భ శుభుడు. చక్కని కార్య సిద్ధి. శ్రమకు తగిన గుర్తింపు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. కీర్తి మరియు ధన లాభము. ప్రయాణాలు లాభించుట. పదోన్నతులు. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి అనుకూల ఫలితాలు. భ్రాతృ సంబంధిత ప్రతికూలతలు. సర్వత్రా ఆనందదాయకం.

 

రాహువు గోచారము:

18.05.2025 వరకు మీన రాశిలో శుభుడు. చక్కని కార్యసిద్ధి, తలపెట్టిన పనులు సునాయాసంగా సాధించ గలుగుట, ఆదాయము పెరుగుట, అధిక ధన లాభము. పదోన్నతులు, వ్యాపారులకు అనుకూల సమయము. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. సజ్జన సాంగత్యము. గొంతుకు చెందిన సమస్యలు. సర్వత్రా శుభ ఫలాలు.

18.05.2025 నుండి వత్సరాంతం వరకు ప్రతికూలుడు. దుష్టులతో అకారణ కలహాలు. ఆర్ధిక మోసాలు. ఆర్ధిక లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి. ఒడుదుడుకులతో సాగు ఆర్థికాభివృద్ధి. స్పెక్యులేటివ్ పెట్టుబడులందు జాగ్రత్తగా ఉండాలి. ధన మరియు వస్తు నష్టము. దుర్బలత్వం, తేజో క్షీణత.

 

 

కుంభము:

కుంభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఏలినాటి శని నుండి కొంత ఉపశమనము లభించు సూచనలున్నాయి.

 

గురు గోచారం:

14.05.2025 వరకు వృషభ రాశిలో ప్రతికూలుడు. ఆదాయానికి మించిన ఖర్చులు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు స్వల్ప శ్రమతో విజయవంతమగుట. వ్యవహారము లందు ప్రతికూలతలు. స్థాన చలనము, ధన నష్టము, విద్యార్థులకు మరియు వ్యాపారులకు ప్రతికూల సమయం. విద్యార్థులకు ఉన్న విద్య యందు శ్రద్ధ కులుకుతుంది. కాని ఏలినాటి శని వలన శ్రద్ధ క్రమంగా తగ్గుట. మీ ద్వారా మీ అన్నదమ్ములకు లాభము చేకూరుట. అనారోగ్య పరమైన సమస్యలు. మాతృ సంబంధమైన అనారోగ్యము.

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున శుభుడు. దైవానుగ్రహము, ఉపాసనలు సిద్ధించుట, ఆధ్యాత్మిక చింతన పెంపొందుట. ధన మరియు వస్తు లాభము. ఇష్టకార్య సిద్ధి. తలపెట్టిన పనులు విజయవంతంగా ముగియుట. కీర్తి మరియు ధన లాభము. పదోన్నతులు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట. గృహము నందు శుభ కార్యములు. సంతానాభివృద్ధి. వారికి ధన లాభము. ఆస్తుల ద్వారా లాభము.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకంలో ప్రతికూలుడు. ఉద్యోగ మరియు వృత్తి మార్పిడి. అనూహ్య ఆపద, రాజదండన భయం, చొరభయం, సన్నిహితులు మరియు బంధు మిత్రులతో విరోధము మరియు మనస్పర్థలు. కుటుంబ కలహాలు. ఆస్తులకు చెందిన వివాదాలు. సంతానముతో విభేదము. అనారోగ్యము. సహా ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులతో విభేదాలు. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునంలో వత్సరాంతం వరకు శుభుడు. దైవానుగ్రహము, ఉపాసనలు సిద్ధించుట, ఆధ్యాత్మిక చింతన పెంపొందుట. ధన మరియు వస్తు లాభము. ఇష్టకార్య సిద్ధి. తలపెట్టిన పనులు విజయవంతంగా ముగియుట. కీర్తి మరియు ధన లాభము. పదోన్నతులు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట. గృహము నందు శుభ కార్యములు. సంతానాభివృద్ధి. వారికి ధన లాభము. ఆస్తుల ద్వారా లాభము.

 

శని గోచారం:

వత్సరాంతం వరకు కూడా శని ప్రతికూలుడు. గౌరవ మరియు కీర్తి నాశనము, ధన హాని, వృధా ఖర్చులు, ధన సంపత్తి కరిగిపోవుట, పెట్టుబడులు నిలిచి పోవుట, రావలసిన ధనం సమయానికి అందకపోవుట. బంధువులు మరియు సన్నిహితులతో విభేదాలు, అనవసర దూషణలు వినవలసి వస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గుట. వ్యాపారులకు ప్రతికూలతలు. కుటుంబ కలహాలు. అనారోగ్యము. నేత్ర సంబంధ సమస్యలు. స్వల్ప ప్రమాదాలు.

 

రాహువు గోచారము:

18.05.2025 వరకు మీన రాశిలో ప్రతికూలుడు. దుష్టులతో అకారణ కలహాలు. ఆర్ధిక మోసాలు. ఆర్ధిక లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి. ఒడుదుడుకులతో సాగు ఆర్థికాభివృద్ధి. స్పెక్యులేటివ్ పెట్టుబడులందు జాగ్రత్తగా ఉండాలి. ధన మరియు వస్తు నష్టము. దుర్బలత్వం, తేజో క్షీణత..

18.05.2025 నుండి వత్సరాంతం వరకు జన్మ రాశిలో ప్రతికూలుడు. దుర్బలత్వం, తేజో క్షీణత. కార్య విఘ్నము, భాగస్వాములతో విభేదాలు, శత్రు వృద్ధి, జ్వర సంబంధమైన బాధలు. ఊహించని ఒడుదుడుకులు. అవకాశాలు చేజారిపోవుట. పొగాకు ఇత్యాది వ్యసనాలకు దూరంగా ఉండాలి.

 

 

మీనము:

మీన రాశి వారికి వత్సరాంతం వరకు కూడా ప్రతికూల ఫలాలు అధికంగా లభిస్తాయి.

 

గురు గోచారం:

14.05.2025 వరకు వృషభ రాశిలో ప్రతికూలుడు. పట్టుదల సడలింపు, అనూహ్య ప్రమాదాలు, దరిద్రము, వ్యవహార నాశనము, బంధు విరోధము, శారీరిక శ్రమ, చెవి, ముక్కు మరియు గొంతుకు చెందిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు. విద్యార్థి మరియు వ్యాపారులకు ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

14.05.2025 నుండి 18.10.2025 వరకు మిథున రాశిలో ప్రతికూలుడు. ఆదాయానికి మించిన ఖర్చులు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు స్వల్ప శ్రమతో విజయవంతమగుట. వ్యవహారము లందు ప్రతికూలతలు. స్థాన చలనము, ధన నష్టము, విద్యార్థులకు మరియు వ్యాపారులకు ప్రతికూల సమయం. విద్యార్థులకు ఉన్న విద్య యందు శ్రద్ధ కులుకుతుంది. కాని ఏలినాటి శని వలన శ్రద్ధ క్రమంగా తగ్గుట. మీ ద్వారా మీ అన్నదమ్ములకు లాభము చేకూరుట. అనారోగ్య పరమైన సమస్యలు. మాతృ సంబంధమైన అనారోగ్యము.

18.10.2025 నుండి 05.12.2025 వరకు కర్కాటకంలో శుభుడు. దైవానుగ్రహము, ఉపాసనలు సిద్ధించుట, ఆధ్యాత్మిక చింతన పెంపొందుట. ధన మరియు వస్తు లాభము. ఇష్టకార్య సిద్ధి. తలపెట్టిన పనులు విజయవంతంగా ముగియుట. కీర్తి మరియు ధన లాభము. పదోన్నతులు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట. గృహము నందు శుభ కార్యములు. సంతానాభివృద్ధి. వారికి ధన లాభము. ఆస్తుల ద్వారా లాభము.

05.12.2025 నుండి వత్సరాంతం వరకు మిథునంలో ప్రతికూలుడు. ఆదాయానికి మించిన ఖర్చులు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు స్వల్ప శ్రమతో విజయవంతమగుట. వ్యవహారము లందు ప్రతికూలతలు. స్థాన చలనము, ధన నష్టము, విద్యార్థులకు మరియు వ్యాపారులకు ప్రతికూల సమయం. విద్యార్థులకు ఉన్న విద్య యందు శ్రద్ధ కులుకుతుంది. కాని ఏలినాటి శని వలన శ్రద్ధ క్రమంగా తగ్గుట. మీ ద్వారా మీ అన్నదమ్ములకు లాభము చేకూరుట. అనారోగ్య పరమైన సమస్యలు. మాతృ సంబంధమైన అనారోగ్యము.

 

శని గోచారం:

వత్సరాంతం వరకు జన్మ శని. శారీరిక శ్రమ, అనారోగ్యము, తేజస్సు క్షీణించుట, మానసిక చింత అధికం, పనులు కాకపోవుట. అధిక శ్రమతో కూడిన ఫలాలు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలం, కీళ్ళు చర్మ మరియు జీర్ణకోశ సంబంధిత సమస్యలు. వాత సంబంధిత సమస్యలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. పెట్టుబడులందు లాభాలు మందగించుట. సోమరితనము.

 

రాహువు గోచారము:

18.05.2025 వరకు జన్మ రాశిలో ప్రతికూలుడు. దుర్బలత్వం, తేజో క్షీణత. కార్య విఘ్నము, భాగస్వాములతో విభేదాలు, శత్రు వృద్ధి, జ్వర సంబంధమైన బాధలు. ఊహించని ఒడుదుడుకులు. అవకాశాలు చేజారిపోవుట. పొగాకు ఇత్యాది వ్యసనాలకు దూరంగా ఉండాలి.

18.05.2025 నుండి వత్సరాంతం వరకు కుంభ రాశిలో వత్సరాంతం వరకు ప్రతికూలుడు. కార్య విఘ్నము, భార్య భర్తల మధ్య కలహాలు, శత్రు వృద్ధి, అనుకోని ఒడుదుడుకులు, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట, మనో వ్యాకులత. స్థాన చలనము, శారీరిక శ్రమ అధికం, అవమానాలు, వృధా ఖర్చులు, వివాదాలు, నేత్ర సంబంధమైన చిక్కులు, అకారణంగా కలహాలు, అనవసరమైన వివాదాలు. పాపకార్య చింతన ఇత్యాది ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

 

దుర్బలత్వం, తేజో క్షీణత. కార్య విఘ్నము, భాగస్వాములతో విభేదాలు, శత్రు వృద్ధి, జ్వర సంబంధమైన బాధలు. ఊహించని ఒడుదుడుకులు. అవకాశాలు చేజారిపోవుట. పొగాకు ఇత్యాది వ్యసనాలకు దూరంగా ఉండాలి.

 

గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్న గ్రహాలకు చేసుకోవాల్సిన శాంతుల గూర్చి సంప్రదించ గలరు.

 

 

 

||శుభం భూయాత్||